గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్కు.. భారీగా ఉన్న ఎక్స్అఫీషియో ఓటర్లతో కూడా మేయర్ పీఠం దక్కే పరిస్థితి లేదు. ఎంఐఎం మద్దతు ప్రత్యక్షంగా.. పరోక్షంగా తీసుకున్నా… తర్వాత సాధారణ ఎన్నికల్లో బీజేపీకి పీఠాన్ని పువ్వులో పెట్టి అప్పగించినట్లే అవుతుంది. అందుకే… ఎంఐఎం జోలికి వెళ్లకుండా… రాష్ట్ర అధికార పీఠాన్ని దగ్గరగా ఉంచుకోవడానికి.. గ్రేటర్ పీఠాన్ని వదులుకోవాలని టీఆర్ఎస్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ పార్టీ నాయకులతో చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. హైదరాబాద్ ప్రజలు పూర్తి మెజార్టీ ఇవ్వలేదని.. అలాంటప్పుడు.. ఎంఐఎంతో వెళ్లి లేని పోని సమస్యలు తెచ్చుకోవడం కన్నా.. స్పెషలాఫీసర్ పాలనకు వదిలేయడమే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే ఇప్పుడుకొత్త చర్చలకు కారణం అవుతోంది.
టీఆర్ఎస్కు కనీసం 70 కార్పొరేటర్ స్థానాలు వచ్చినా సమస్య ఉండేది కాదు. కనీసం.. ఇండిపెండెంట్లు అయినా ఓ పది మంది గెల్చినా ఇబ్బంది ఉండేది కాదు.కానీ ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్లు కూడా ఎవరూ గెలవలేదు. కాంగ్రెస్ రెండు మినహా.. మిగతా అన్ని సీట్లు..మూడుప్రధాన పార్టీలు పంచుకున్నాయి. ఆ మూడు ఒకదానితో ఒకటి కలిసే పరిస్థితి లేదు. ఉన్న ఆప్షన్ ఒకటే.. అది టీఆర్ఎస్, ఎంఐఎం కలవడం. కానీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ దూకుడుని విశ్లేషించుకుని టీఆర్ఎస్.. ఈ ఆప్షన్‌కు నో చెప్పేస్తోంది.
వచ్చే నెల వరకూ.. ప్రస్తుతం ఉన్న గ్రేటర్ పాలకవర్గం పదవీకాలం ఉంటుంది. అప్పట్లోపు మేయర్ ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా పూర్తి మెజార్టీ వచ్చి ఉంటే.. ఈ పాటికి ఎన్నిక పూర్తి చేసి ఉండేవారు. ఎవరికీ రాకపోవడంతో… ప్రస్తుత పాలకవర్గం గడువు ముగిసేవరకూ ఎదురు చూడాలని నిర్ణయించారు. ఆ తర్వాత కూడా రాజకీయ పరిస్థితుల్లో మార్పు లేకపోతే.. స్పెషలాఫీసర్ పాలన విధించే అవకాశం ఉంది. ఓ పది… పదిహేను మంది కార్పొరేటర్లు… టీఆర్ఎస్కు జై కొడితే పరిస్థితి మారొచ్చారు. ఎంఐఎం కార్పొరేటర్లు పార్టీ మారరు. బీజేపీ కార్పొరేటర్లు కూడా మారే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఎవరి పార్టీలో వారుంటే మాత్రం… స్పెషలాఫీసర్ పాలనకే కేటీఆర్ మొగ్గు చూపుతారని అంటున్నారు.