మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `సర్కారు వారి పాట`. సినిమా షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు గానీ, ఈ సినిమా కథేమిటన్నది చూచాయిగా అర్థమైపోయింది అందరికీ. బ్యాంకుల దగ్గర నుంచి వందల కోట్లు అప్పు చేసి, విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా లాంటి వాళ్ల మెడలు వంచిన ఓ హీరో కథ ఇది. అయితే పోస్టరు రూపాయి నాణెం.. అందరినీ ఆకట్టుకుంటోంది. దాని వెనుక కూడా ఓ కథ ఉందట.
ఈ కథలో హీరో డబ్బు విలువ బాగా తెలిసిన వాడు. ప్రతీ రూపాయీ తనకు లెక్కే. డబ్బులు సంపాదించాలన్న ఆశయం.. హీరోకి ఒక్క రూపాయితోనే మొదలవుతుంది.చిన్నప్పుడే అమ్మానాన్నల్ని కోల్పోయిన హీరో..కి ఆరోజు మిగిలేది ఒక్క రూపాయే. ఆ ఒక్క రూపాయితో.. కోట్లు సంపాదించాలన్న ఆలోచన వస్తుంది. అది కూడా న్యాయమైన పద్ధతిలో. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఈ లైన్ వింటే.. 5 పైసలతో 20 లక్షలు సంపాదించిన `ఛాలెంజ్` గుర్తొస్తుంది. `శివాజీ`లో రజనీకాంత్ ప్రయాణం కూడా రూపాయితోనే మొదలవుతుంది. అయితే ఈ కథకు పోలిక లేకుండా…. పరశురామ్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడట. ఆ పాయింట్ నచ్చే…మహేష్ కూడా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. జనవరి నుంచి అమెరికాలో షెడ్యూల్ మొదలవ్వాల్సింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో.. ఆ షెడ్యూల్ వాయిదా పడింది. అమెరికా షెడ్యూల్ స్థానంలో హైదరాబాద్ లోనే షూటింగ్ మొదలు పెట్టనున్నారు.