సీన్ రివర్స్ అయ్యింది. ఆసీస్ చేతిలో 2-1 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్…. టీ 20 సిరీస్ ని మాత్రం 2-1 తో దక్కించుకుంది. వన్డే సిరీస్ లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆసీస్.. చివరి వన్డే ఓడిపోతే, తొలి 2 టీ 20లను గెలుచుకున్న భారత్… చివరి టీ 20 ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. ఈ రోజు సిడ్నీలో జరిగిన చివరి టీ 20లో భారత్ పై ఆసీస్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది.
టాస్ గెలిచిన కోహ్లీ… ఆసీస్‌ని బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ మ్యాచ్యూ హైడ్ మరోసారి రాణించాడు. 53 బంతుల్లో 80 పరుగులు చేసి, ఆస్ట్రేలియా భారీ స్కోరుకి పునాది వేశాడు. మెక్స్ వెల్ 54 పరుగులు సాధించడంతో… భారత్ ముందు భారీ విజయలక్ష్యాన్ని ఉంచగలిగింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ కి 2 వికెట్లు, నటనరాజన్, శార్థూల్ ఠాకూర్‌కి చెరో వికెట్ దక్కాయి.
భారత్ ఛేజింగ్ తడబడుతూ ప్రారంభమైంది. తొలి ఓవర్లోనే రాహుల్ డకౌట్ అయ్యాడు. అయితే కోహ్లీ కెప్టెన్ ఇన్సింగ్స్ ఆడడంతో భారత ఇన్నింగ్స్ కుదుట పడింది. అయితే మరోవైపు నుంచి కోహ్లీకి సహకారం అందలేదు. శేఖర్ ధావన్ 28 పరుగులే చేశాడు. శాంసన్, శ్రేయాస్ అయ్యర్ వికెట్లు వెను వెంటనే పడడంతో.. భారత్ కష్టాల్లో పడింది. అద్భుత ఫామ్ లో ఉన్న హార్థిక్ పాండ్యా (20) కాసేపు బ్యాట్ ఝులిపించినా ప్రయోజనం లేకపోయింది. కోహ్లీ చ(61 బంతుల్లో 85) వికెట్ పడడంతో.. భారత్ పరాజయం ఖాయమైంది.