మహేష్ బాబు – పరశురామ్ కలయికలో రూపొందుతున్న చిత్రం `సర్కారు వారి పాట`. కీర్తి సురేష్ కథానాయిక. ఈపాటికే ఈ సినిమా సెట్స్‌పై ఉండాల్సింది. కరోనా వల్ల ఆగింది. జనవరి నుంచి జరగాల్సిన అమెరికా షెడ్యూల్ కూడా.. వాయిదా పడింది. అయితే ఈలోగా… స్క్రిప్టుని మరింత పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దుకోవడానికి పరశురామ్ కి ఓ మంచి అవకాశం దక్కింది. దాంతో.. ఈ కథలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయని సమాచారం.
`సర్కారు వారి పాట` కథ మహేష్ కి తొలిసారి వినిపించేటప్పుడు ఇదో రివైంజ్ స్టోరీ. తన తల్లిని మోసం చేసిన ఓ వైట్ కాలర్ నేరస్థుడ్ని పట్టుకోవడానికి కథానాయకుడు చేసే ప్రయత్నం.. సర్కారు వారి పాట. ఇది మహేష్‌కి కూడా నచ్చింది. అయితే… లాక్ డౌన్ సమయంలో, కథని, స్క్రిప్టుని పునః పరిశీలించుకోవడానికి అవకాశం దక్కింది. ఈ గ్యాప్‌లో రివైంజ్ డ్రామా రొటీన్ ఫార్ములా అనిపించిందేమో, దాన్ని కాస్త మార్చినట్టు తెలుస్తోంది. తల్లి పాత్రని పూర్తిగా తొలగించినట్టు టాక్. సరదాగా మొదలైన హీరో ప్రయాణం.. ఓచోట సీరియస్ మలుపు తీసుకోవడం, అక్కడి నుంచి వైట్ కాలర్ నేరస్థుల్నిపట్టుకోవాలన్న లక్ష్యం ఏర్పడడం జరుగుతాయని, దానికి తగ్గట్టుగా కథని మార్చాడని సమాచారం. కొత్తగా చేసిన మార్పుల వల్ల, కథ మరింత బలంగా తయారైందని, ఈ మార్పులపై పరశురామ్ కూడా సంతృప్తిగా ఉన్నాడని, అమెరికాలో తెరకెక్కించాల్సిన సన్నివేశాల్ని కుదించే అవకాశమూ కలిగిందని తెలుస్తోంది. సో.. ఈ లాక్ డౌన్ సర్కారు వారి పాటకు మేలే చేసిందన్నమాట.