ఇండియాలో టీకా పంపిణీకి ముహుర్తం ఖరారు చేశారు. డిసెంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి టీకాను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే.. అసలు ఏ కంపెనీ టీకాను ఇస్తారు..? భారత్లో పంపిణీకి సిద్ధంగా ఏ కంపెనీ టీకా ఉంది..? అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకున్న టీకా ఎక్కడ సిద్ధమయింది..? అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. యూకేలో అధికారికంగా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. అక్కడ టీకాకు అన్ని రకాల అనుమతులు ఇచ్చారు. కానీ భారత్లో ఇంత వరకూ.. మూడో దశ పరీక్షలు పూర్తయిన టీకా ఒక్కటంటే ఒక్కటీ లేదు. భారత్ బయోటెక్… తమ పరీక్షలు పూర్తయ్యాయని.. అత్యవసర వినియోగానికి అవకాశం ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంది. అలాగే ఫైజర్ కూడా.. టీకా పంపిణీకి దరఖాస్తు చేసింది. వీటన్నింటినీ పరిశీలించి.. నిపుణుల కమిటీ అనుమతి ఇవ్వాల్సి ఉంది. అయితే.. చాలా డేటాను పరిశీలించాల్సి ఉంటుంది. ఆషామాషీగా టీకా ఇచ్చే పరిస్థితి ఉండదు.
అయితే భారత్ సర్కార్ మాత్రం వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చేందుకు సిద్ధమయింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. యుద్ధ ప్రాతిపదికన అందించేందుకు ఏర్పాట్లు చేయించేసింది. తొలి విడతలోనే దేశవ్యాప్తంగా 30 కోట్ల జనాభాకు టీకా వేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంత పెద్ద మొత్తంలో ఏ కంపెనీ టీకాలు సరఫరా చేస్తుందో కూడా స్పష్టత లేదు. నిర్దేశించిన వ్యక్తులకు 2 డోసుల చొప్పున 3 నుంచి 4 వారాల వ్యవధిలో ఇవ్వాలి. ఎప్పటికప్పుడు.. వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలి. ఇందు కోసం.. కొన్ని లక్షల బృందాలను నియమించాల్సి ఉంటుంది.
వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే, తక్కువ సమయంలో… సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలను ఇవ్వడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే టీకా డ్రై రన్, సాఫ్ట్వేర్లను సరిచూసుకుని, వ్యాక్సిన్ రాక కోసం రాష్ట్ర ప్రభుత్వాలుఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, 50 ఏళ్లు పైబడిన వారు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, రవాణా ఉద్యోగులు, మీడియా ప్రతినిధులకే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. కోవిడ్ టీకాల నిల్వ ప్రధాన్యాంశం కావడంతో.. అతి శీతల యూనిట్లను రాష్ట్రాల ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే, టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయమై కేంద్రం నుంచి ఇంతవరకూ స్పష్టమైన సమాచారం రాలేదు. లేకపోవడం కొసమెరుపు. ఏమైనా తేడా వస్తే ప్రజల ఆరోగ్యంపైనే ప్రభావం చూపుతుందనే ఆందోళన నిపుణుల్లో వ్యక్తమవుతోంది