శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని డిసెంబర్ 21న ఏపీ సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా అసలు భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. మొత్తం 17 వేల 460 గ్రామాల్లో శాశ్వత భూ హక్కు, భూరక్షణ పథకం సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో 5 వేలు, రెండో విడతో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో సర్వే ఉంటుంది. పట్టణాలు, నగరాల్లో కలిపి 3345.93 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే నిర్వహిస్తారు. 10 లక్షల ఓపెన్ ప్లాట్లు, 40 లక్షల అసెస్ మెంట్ భూముల్లో సర్వేతోపాటు 2.26 కోట్ల ఎకరాలున్న 90 లక్షల మంది పట్టాదారు భూములు సైతం ఈ సర్వేలో భాగమవుతాయి. సర్వే నిర్వహించాక ల్యాండ్ టైటిలింగ్ కార్డ్ ఇస్తారు. కార్డ్ లో యూనిక్ ఐడెంటీఫికేషన్ నెంబర్, భూ కొలతలు, యజమాని పేరు, ఫొటో ఉంటుంది. వీటితోపాటు ఒక క్యూఆర్ కోడ్ ను కూడా జత చేస్తారు. ఈ భూ కొలతలు పూర్తయ్యాక సర్వే రాళ్లు పాతుతారు. గ్రామ సచివాలయంలో డిజిటైజ్డ్ ప్రాపర్టీ రిజిస్టర్, టైటిల్ రిజిస్టర్, వివాదాల నమోదుకు రిజిస్టర్లు ఏర్పాటు చేస్తారు.
ప్రతి మండలానికి సర్వే కోసం ఒక డ్రోన్ బృందం, డేటా ప్రాసెసింగ్ టీమ్, రీ సర్వే టీమ్ ఉంటాయి. ఇప్పటికే 9,400 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చారు. సర్వే ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని మరింత మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో సర్వే పూర్తయిన వెంటనే మ్యాప్స్ సిద్ధం చేసి గ్రామ సచివాలయంలోనే ల్యాండ్ రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని సీఎం జగన్ ఈ సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. భూ వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఒకసారి సర్వే పూర్తయ్యాక ఆ రికార్డులను ట్యాంపరింగ్ చేయలేని రీతిలో వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు.సెక్యూరిటీ ఫీచర్స్ పటిష్టంగా ఉండాలని, భూ యజమానుల వద్ద కూడా ఒక హార్డ్ కాపీ ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ భూ సర్వే పై ప్రజల్లో అనేక రకాల అనుమానాలు రావడం సహజం. తమ భూమి విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయోనని వారు ఆందోళన చెందొచ్చు. అందుకే ప్రజల్లో అనుమానాలను తక్షణం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని.. సీఎం అధికారులను ఆదేశించారు. అధికారులు కాస్త సీరియస్గా దృష్టిపెడితే.. సర్వే పూర్తయ్యే నాటికి ఏపీలో ఇక భూ వివాదాలు ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.