తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయంగా చేస్తున్న తప్పులు భారతీయజనతా పార్టీకి అనూహ్యమైన మద్దతు లభించేలా చేస్తున్నాయి. ఉద్యోగుల్లో తమపై తీవ్ర అసంతృప్తి ఉందని గట్టిగా నమ్ముతున్న ప్రభుత్వం .. వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేయకపోగా… మరింత రెచ్చగొడుతున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఉద్యోగ సంఘాల నేత ఏలూరు శ్రీనివాసరావును ఉన్న పళంగా సస్పెండ్ చేశారు. ఆయనను సస్పెండ్ చేయడానికి ఉద్యోగపరమైన కారణాలేమీ లేవు.. ఆయన బండి సంజయ్‌తో భేటీ కావడమే చేసిన తప్పు. దీంతో… ఉద్యోగుల్లో అలజడి ప్రారంభమయింది. ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ నేతలు రంగంలోకి వచ్చేశారు. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
నిజానికి తెలంగాణ బీజేపీ నేతలు ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను కేసీఆర్ పెద్దగా ఇవ్వలేదన్న భావనలో ఉన్నారు. అదే సమయంలో.. పై స్థాయి ఉద్యోగ సంఘ నాయకత్వాన్ని అధికారంతో బెదిరించి.. నోరెత్తకుండా చేస్తున్నారని తమకు అన్యాయం చేస్తున్నారన్న భావనలో ఉన్నారు. ఉద్యమంలో పాల్గొని.. రాష్ట్రం రావడానికి సహకరించిన తమకు..టీఆర్ఎస్ అనుకున్నంతగా మేలు చేయలేదని అంతిమంగా వారి భావన. దీన్ని ఇప్పుడు బీజేపీ హైలెట్ చేస్తోంది. ఉద్యమకారులకు టీఆర్ఎస్ మేలు చేయడం లేదన్న అభిప్రాయాన్ని మరింత విస్తృతంగా ఉద్యోగుల్లోకి పంపుతోంది.
ఉద్యోగుల్లో బీజేపీ పట్ల ఆదరణ ఉందని.. బ్యాలెట్ ఓట్ల ద్వారా తేలిపోయింది. గ్రేటర్ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు.. బీజేపీకి అత్యధికంగా వచ్చాయి. అదే సమయంలో.. ఉద్యోగసంఘాల నేతగా పని చేసి… సకలజనుల సమ్మెను ఒంటి చేత్తో నడిపించిన స్వామిగౌడ్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆయన కూడా… ఉద్యోగుల్లో తనకు ఉన్నపలుకుబడిని ఉపయోగించి.. బీజేపీకి మద్దతు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసి… ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధులకు దూరంగా పెట్టారు ప్రభుత్వ పెద్దలు. అంటే ఇక టీఆర్ఎస్ దూరం చేసుకున్నట్లేనని.. తాము దగ్గర చేసుకుంటామని బీజేపీ నేతల అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగులు వ్యతిరేకం అయితే టీఆర్ఎస్ సర్కార్‌కు గడ్డు పరిస్థితి వచ్చినట్లే.