కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, మాజీ ఎమ్మెల్సీ, మేధావి వర్గంలో ప్రముఖుడిగా పేరున్న పరకాల ప్రభాకర్ అమరావతి విషాదం పేరుతో డాక్యుమెంటరీ తీశారు. దాన్ని ఆయన ఏపీ వ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు. మొన్న ఆదివారం… హైదరాబాద్‌లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ప్రివ్యూ ఏర్పాటు చేశారు. బుధవారం విశాఖలో ఏర్పాటుచేశారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆయన అమరావతి, మూడురాజధానుల గురించి తాను చెప్పాలనుకున్నది చెబుతున్నారు. ఫైనల్‌గా ఇప్పటి వరకూ రాజకీయం మాట్లాడింది.. ఇక నుంచైనా.. ప్రజలు, జర్నలిస్టులు, మేధావులు.. ఇలా అన్ని వర్గాల్లోనూ.. చర్చ జరగాల్సి ఉందని అంటున్నారు.
పరకాల ప్రభాకర్ రూపొందించిన అమరావతి విషాదం డాక్యుమెంటరీ ఒక్క అమరావతి గురించి కాదు… మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేని దుస్థితిని కళ్లకు కట్టేలా ఉంది. నాడు మద్రాస్ నుంచి వెళ్లగొట్టిన వైనం.. కర్నూలు రాజధాని.. ఆ తర్వాత హైదరాబాద్.. ఇప్పుడు.. అమరావతి.. ఇలా ప్రతి ఒక్కటి.. ఎందుకు జరిగింది.. కారణం ఏమిటి..అన్నదానిపై విశ్లేషణ జరిపారు. అదే సమయంలో రాజధాని ఎందుకు వివాదాస్పదం అయిందన్నదానిపైనా చర్చించారు. రాజధాని అంశంపై విస్తృతంగా చర్చ జరగాలని ..రాష్ట్రంలో ప్రతి సమస్య రాజధాని తో ముడిపడి ఉందని ఆయన అంటున్నారు. రాజధానిపై స్పష్టత లేకపోవడం వల్లే ఏపీకి ప్రస్తుత పరిస్థితి దాపురించిందని ఆయన అంటున్నారు.
తన గంట డాక్యుమెంటరీలో పరకాల వీలైనంత ఎక్కువ రాజధాని అంశాన్ని చర్చించారు. పాలన కు వేదికగా ఉండవలసిన అమరావతి ఆందోళనలు, ఆవేదనకు వేదికగా మారడంపై తన ఆవేదన వెలిబుచ్చారు. ఈ సమస్య కు ఏక్కడో ఒక్క దగ్గర ఫుల్ స్టాప్ పడాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. అమరావతిపై చర్చ జరగాలని ఆయన కోరుకోవడం లేదు. అసలు సంపూర్ణంగా రాజధానిపై చర్చ జరగాలని.. మూడు రాజధానులపై చర్చ జరగాలని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకూ రాజకీయమే రాజధాని అంశాన్ని డామినేట్ చేస్తోందని.. కానీ ఇప్పుడు సమాజంలోని అన్ని వర్గాలు బయటకు వచ్చి చర్చించాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ డాక్యుమెంటరీని ఓటీటీలో ముందుగా విడుదల చేసి.. తర్వాత సోషల్ మీడియాలో ఉంచుతామని అంటున్నారు.