థియేటర్లకు మళ్లీ ఆ కళ రావాలి.
థియేటర్లలో సినిమా చూడాలని సినీ ప్రియులు ఉత్సాహం చూపించే రోజులు రావాలి.
నిర్మాతల ఆశలు, ఆలోచనలూ వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రేక్షకులకు మళ్లీ సినిమా అనుభూతిని ఇవ్వాలనే దిశగా… చిత్రసీమలో ఆలోచనలు మొదలయ్యాయి. ప్రేక్షకుడికీ, థియేటర్‌కీ ఎలాంటి అడ్డుగోడలూ ఉండకూడదన్న అభిప్రాయం వాళ్లది. అందుకే.. థియేటర్ వ్యవస్థలో లోపాల్ని పసిగట్టి, వాటి పని పనిపట్టే పనిలో.. నిమగ్నమైంది చిత్రసీమ.
సామాన్యుడికి థియేటర్‌కి వెళ్లడం ఈరోజుల్లో భారమే. ఎందుకంటే టికెట్ రేట్లు పెరిగాయి. పార్కింగ్ బాదుడు ఎలాగూ ఉంది. దాంతో పాటు థియేటర్ల దోపిడీ మామూలుగా ఉండదు. అక్కడ మంచి నీళ్ల సీసా కొనాలన్నా.. భయమే. సమోసా, పాప్ కార్న్.. అన్ని రేట్లూ భగ్గుమంటుంటాయి. కొత్త సినిమాలొచ్చినప్పుడు `కాంబో ప్యాక్` అంటూ టికెట్ నీ, పాప్ కార్న్ నీ కలిపి అమ్ముకుని సొమ్ము చేసుకోవడం చూశాం. ఇప్పుడు ఇలాంటి పప్పులేం ఉడకవు. థియేటర్ల దోపిడీని అడ్డుకోవడంపై నిర్మాతలంతా ఇప్పుడు దృష్టి పెట్టారు. థియేటర్లలో తినుబండారాల అమ్మకం, వాటి ధరలపై ఓ నియంత్రణ ఉండాలని, కాంబో ప్యాక్‌లను పూర్తిగా నిషేధించాలని, ధియేటర్లలో మంచినీరు ఉచితంగా అందించే ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ వినతీపత్రం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు.
“థియేటర్ కి వెళ్లాలంటే సామాన్య ప్రేక్షకుడు భయపడుతున్నాడు. టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. బయటి నుంచి తినుబండారాలు తీసుకెళ్లేందుకు ఎక్కడా అనుమతులు లేవు. మల్టీప్లెక్స్‌లలో మంచినీళ్ల బాటిల్ కూడా తీసుకెళ్లేందుకు ఒప్పుకోవడం లేదు. ఇలాంటివన్నీ మారాలి. థియేటర్లో చవక ధరలకు తినుబండారాలు అమ్మాలి. లేదంటే.. బయటి నుంచి తీసుకెళ్లే వెసులు బాటు కల్పించాలి. మరీ ముఖ్యంగా పార్కింగ్ ఫీజులపై కూడా నియంత్రణ ఉండాలి. లేదంటే.. ప్రేక్షకుడు థియేటర్‌కి శాశ్వతంగా దూరం అవుతాడు“ అని ఓ ప్రముఖ నిర్మాత తన అభిప్రాయం వెల్లడించాడు.
టికెట్ రేట్లు పెంచే వెసులు బాటు కావాలని ఇటీవల నిర్మాతలు కోరడం, దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం జరిగాయి. అయితే టికెట్ రేట్ల పెంపు కొత్తసినిమాలకు, అందులోనూ… స్టార్ సినిమాలకు మాత్రమే.చిన్న సినిమాలకు ఎలాగూ పాత రేట్లే వర్తిస్తాయి. అయితే టికెట్ రేటు ఎంత ఉండాలన్న విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు కూడా సదరు నిర్మాతకే ఉండాలి గానీ, థియేటర్ యాజమాన్యానికి కాదు. ఈ విషయంలో సైతం ప్రభుత్వం నుంచి ఓ జీవో రావాలని నిర్మాతలు భావిస్తున్నారు. మొత్తానికి ప్రేక్షకుడ్ని మళ్లీ థియేటర్లకు రప్పించాలన్న ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రేక్షకుడిపై భారం తగ్గిస్తే.. అంతకంటే కావల్సిందేముంది?