పదవి వచ్చిన ఆత్రమో… అధికార పార్టీ అనే అహమో కానీ.. వైసీపీ నేతలు ఒకరిని మించి వివాదాస్పద అంశాలతో వార్తల్లోకి వస్తున్నారు. ప్రభుత్వం లెక్కకు మిక్కిలిగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లలో ఒక దానికి చైర్పర్సన్ పదవి పొందిన దేవళ్ల రేవతి అనే మహిళ.. టోల్గేట్ వద్ద తన కారును ఆపడాన్ని అవమానంగా ఫీలయింది. గుంటూరు కాజ టోల్ గేట్ వద్ద.. తన కారును పంపలేదని.. రచ్చ చేసింది. టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసింది. ఆ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నేషనల్ చానల్స్‌లో కూడా వచ్చాయి. ఆమె దాడి చేయడంపై.. టోల్ గేట్ సిబ్బంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
అయితే.. ఆమె కూడా వెంటనే ఎదురుదాడికి దిగారు. టోల్గేట్ సిబ్బంది తనను వేధించారని .. ఆరగంట పాటు పోనీయలేదని చెప్పుకొచ్చారు. తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తున్నందువల్ల త్వరగా వెళ్లాలని వేడుకున్నారనని.. అరగంట పాటు వేడుకున్నా పోనీయలేదన్నారు. తనకు ఫ్రీ పాస్ ఉందని.. డబ్బులు కట్టకుండా వెళ్తున్నాననడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ఫ్రీ పాస్ ఉంటే…అరగంట సేపు బతిమాలుకోవడం ఏమిటో .. ఆమె వాదన వినిపించిన వారికి అర్థం కాలేదు. టోల్ గేట్ సిబ్బందిపైనే ఆమె ఎదురు ఆరోపణలు చేసి కవర్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు.
చోటామోటా వైసీపీ నేతలు… ప్రభుత్వం తమదే కాబట్టి.. తమకెవరూ అడ్డు చెప్పకూడదన్నట్లుగా సీన్ క్రియేట్ చేస్తూండం.. ఆ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. దేవళ్ల రేవతికి గతంలో ఓ దేవస్థానం బోర్డులో పదవి ఇచ్చారు. అయితే.. భక్తురాలు … అమ్మవారికి సమర్పించిన చీరను తీసుకెళ్లిపోయారు. ఆ విషయం వెలుగులోకి రావడంతో ఆ పదవి కోల్పోయారు. ఇప్పుడు.. టోల్ గేట్ వివాదంతో మరోసారి తెరపైకి వచ్చారు.