తన కలలు చాలా వరకు నెర వేరాయని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న తర్వాత కేసీఆర్ బహిరంగసభలో ప్రసంగించారు. అయితే ఆ ప్రసంగంలో కేసీఆర్ మార్క్ లేదు. పైగా తన కలలన్నీ నెరవేరాయన్నట్లుగా మాట్లాడారు. తెలంగాణలో కాదు.. ఇక దేశాన్ని సంస్కరిస్తానని.. 70 ఏళ్ల కాలంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ , బీజేపీలు కనీసం సాగునీరు కూడా ఇవ్వలేకపోతున్నాయని కేసీఆర్ అంటూండేవారు. అయితే ఇప్పుడు.. మాత్రం తన ప్రసంగంలో అలాంటి ప్రస్తావనే తీసుకు రాలేదు. చాలా రోజుల తర్వాత సిద్దిపేట వెళ్లిన కేసీఆర్ ప్రసంగంలో సిద్ధిపేట సెంటిమెంట్నుగుర్తు చేసుకున్నారు.
సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని చెప్పుకున్నారు. అదే సమయంలో హరీష్ రావును పొగడ్తలతో ముంచెత్తారు. తన లాగే పని చేసే నాయకుడు కావాలని సిద్దిపేటకు హరీష్ రావును పెట్టాని.. ఆయన తన పేరు కాపాడిన నాయకుడని కేసీఆర్ ప్రశంసించారు. ఐటీ హబ్‌తో పాటు.. ఇళ్లను ప్రారంభించిన కేసీఆర్ రూ.160 కోట్లతో రాజీవ్ రహదారి విస్తరణ, సిద్దిపేటకు మరో వెయ్యి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, సిద్దిపేటకు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ కోసం రూ.25 కోట్లు ప్రకటించారు.
మామూలుగా బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగం చాలా రేర్‌గా ఉంటుంది. అలాంటి సభ వచ్చినా… ఈ సారి కేసీఆర్ రాజకీయంగా మాట్లాడలేదు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో పరాజయం తర్వాత కేసీఆర్ రాజకీయ వ్యూహం మార్చుకున్నారన్న చర్చ జరుగుతున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.