ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ప్రకృతి విరుద్ధమే అవుతుంది. అలాంటి ప్రకృతి విరుద్ధాన్ని సృష్టించాలనుకుంటే సాధ్యం కాదు. రివర్స్ అవుతుంది. ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ నేతలు.. అధికారంలోకి రాగానే… అప్పటి వరకూ తామున్న ప్రతిపక్ష స్థానాన్ని ఇక లేకుండా చేయాలనుకుంటారు. అధికారం దన్నుతో… అమ్ముడుబోయే నేతల ఆశ కారణంగా వారు కొంత సక్సెస్ కావొచ్చు కానీ… అసలు ప్రతిపక్షమే లేకుడా చేయడం అసాధ్యం. ఆ విషయం చాప కిందకు నీరు వచ్చిన తర్వాతనే గుర్తించగలుగుతారు. ఇప్పుడు .. తెలంగాణలో అదే కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలే ప్రతిపక్షమయ్యారు. తమను ఢీకొట్టే సామర్థ్యం ఎవరికీ లేదని.. ప్రతిపక్ష హోదా కూడా ఎవరికీ లేదని విర్రవీగుతున్న టీఆర్ఎస్‌కు… ప్రజలు తామేంటో చూపించారు. ప్రజల ముందు టీఆర్ఎస్ అయినా.. మరొకటి అయినా… దిగదిడుపే అని తేల్చేశారు.
ప్రతిపక్షం లేకుండా చేసుకున్నాననుకున్న కేసీఆర్..! ఇప్పుడేమయింది..?
ఉద్యమంతో తెలంగాణ ప్రత్యక రాష్ట్రం సాధించిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చింది బొటాబొటి మెజార్టీనే. అంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రజలు కేసీఆర్ ఏకపక్షంగా కిరీటం పెట్టాలనుకోలేదు. గట్టి ప్రతిపక్షాన్ని ఇవ్వాలనుకున్నారు. ఇచ్చారు. కానీ కేసీఆర్ ఆశకుపోయారు..? తెలంగాణ ప్రభుత్వ అస్థిర పరిచే కుట్రలు చేశారంటూ ఇతర పార్టీలను టార్గెట్ చేశారు. మొదట టీడీపీని లేకుండా చేశారు. ఆ పార్టీ నేతల బలహీన వ్యక్తిత్వం.. పదవుల కోసం ఆశ పడిన వైనంతో మొత్తం ఆ పార్టీ తెలంగాణలో చాప చుట్టేసింది. దీంతో కేసీఆర్ రెండో సారి గెలిచిన తర్వాత కాంగ్రెస్ సంగతి చూశారు. ఆ పార్టీలో దశాబ్దాల తరబడి పదవులు అనుభవించిన వారు కూడా…కేసీఆర్ ఆఫర్లకు ఆశపడి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. మిగిలిన కొంత మంది కూడా “లాభాలు చూసుకునే” రాజకీయాలు చేస్తూండటంతో ఆ పార్టీ ఉనికి కష్టంగా మారింది. ఇక కేసీఆర్ తిరుగులేదనుకున్నారు. ఆ ప్రభావం పాలనలో స్పష్టంగా కనిపించింది. విజయాన్ని అందించి పెట్టిన రైతు బంధు లాంటి పథకాల అమల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఏకపక్షత కనిపిస్తోంది. కరోనా కష్టకాలంలో ఎల్‌ఆర్ఎస్ పేరుతో కనీసం రూ. ఇరవై వేల కోట్లు ప్రజల నుంచి పిండుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. ఏం చేసినా.. ప్రజలకు తాము తప్ప ప్రత్యామ్నాయం లేదని… అలాంటి పరిస్థితిని సృష్టించామని ప్రభుత్వ పెద్దలు అనుకోవడమే కారణం. నిజానికి అలాంటి ఆలోచన… అధికారం తలెకెక్కి.. వాస్తవాలను గుర్తించలేని స్థితికి చేరడమే.
ప్రజలిచ్చిన అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల్ని తక్కువ అంచనా వేస్తే ఎలా..!?
ప్రతిపక్షాన్ని లేకుండా చేశాం అనుకోవడం ప్రజాస్వామ్య గొప్ప తనాన్ని.. ప్రజల దగ్గర ఓటు అనే ఆయుధాన్ని తక్కువ చేసి చూడటమే. అలాంటి స్థితికి వెళ్లిన తర్వాత ఇక పతనమే ప్రారంభమవుతుంది. టీఆర్ఎస్‌కు ఇప్పుడు అదే అనుభవం అవుతోంది. ఎప్పుడూ గెలవని … తెలంగాణ అనే సెంటిమెంట్ ఉందో లేదో తెలియని.. కృష్ణా జిల్లాలో ఉందా అనిపించేలా ఉండే… హుజూర్ నగర్ నియోజకవర్గంలో యాభై వేలకుపైగా మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచింది. అలాంటి దుబ్బాక ఉపఎన్నికల్లో ఓడిపోతుదంని ఎవరైనా అనుకుంటారు. దుబ్బాకలో గ్రామాల్లో టీఆర్ఎస్ తప్ప మరో పార్టీ జెండా కనిపించడం కష్టం. అక్కడ ఏ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ప్రజలు అనుకుంటారని పాలకులు అనుకున్నారు. కానీ… ప్రజలే ప్రతిపక్షం అయ్యారు. టీఆర్ఎస్‌కు ప్రతిపక్షాన్ని తెచ్చి పెట్టారు. దుబ్బాక ప్రజలు ఓటుతో కొట్టిన ఒక్క దెబ్బ… వాస్తవాన్ని కళ్ల ముందు ఉంచింది. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అది యాధృచ్చికం కాదని తీర్పు ఇచ్చారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటే సాద్యం కాదని.. తామే ప్రతిపక్షమనుతామని తేల్చి చెప్పేశారు. దుబ్బాకలో ప్రజా తీర్పు వచ్చినప్పుడే.. గుర్తించాల్సిన పాలకులు..అక్కడేదో తప్పు జరిగిందని.. హైదారాబాద్ ప్రజలు మాత్రం..తమకు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి తమనే నెత్తిన పెట్టుకుంటారని ఎక్కువ అంచనా వేసుకున్నారు. అందుకే అవసరం లేకపోయినా ముందస్తుగా గ్రేటర్ ఎన్నికలు పెట్టేశారు. కానీ.. టీడీపీ, కాంగ్రెస్‌లను లేకుండా చేసినా… ఆ పార్టీల్లో గెలిచిన వారు టీఆర్ఎస్‌లో చేరకుండా ఉంటారనే గ్యారంటీ ఏముందనే అభిప్రాయం కల్పించినా ప్రజలు ప్రత్యామ్నాయం చూసుకున్నారే కానీ.. గతి లేదు కగా.. అని టీఆర్ఎస్‌కే ఓటు వేయలేదు.
ప్రతిపక్షం లేకుండా చేయడమే శాశ్వత విజయాలకు షార్ట్‌కట్ ఎలా అవుతుంది..!?
నిజానికి ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఆరాటం.. గత దశాబ్ద కాలంలోనే భారత రాజకీయాల్లో విపరీతంగా పెరిగిపోయింది. అలాంటి విపరీతమైన ఆలోచనలు నాయకులు చేసేవారు కాదు. ఇప్పుడు… ప్రతిపక్షం లేకుండా చేయడమే లక్ష్యంగా పాలన చేయకపోతే.. ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అనుకునే పరిస్థితి వచ్చేసింది. నిజం చెప్పాలంటే..లాంటి భ్రమ కల్పించుకున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ అదే పరిస్థితి. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని.. బీజేపీ పిలుపునిచ్చి..ఆ పార్టీని నిర్వీర్యం చేయడానికి ఎన్ని రకాల ప్రజాస్వామ్య విరుద్ధ పనులు చేయాలో అన్నీ చేస్తోంది. తమకు ఎదురు లేదనుకుని చేయాలనుకున్నవన్నీ చేస్తోంది. కరోనా కష్ట కాలంలో ప్యాకేజీల పేరుతో ప్రజలకు ఎంత మేలు చేస్తున్నారో కానీ వాటికి నిధులంటూ… పెట్రోల్, డిజిల్ మీద పన్నులు బాదేసి ప్రజల నుంచే ఆ సొమ్ములు వసూలు చేశారు. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రజల్లో అలజడి రేపుతున్నాయి. నిరుద్యోగం పెరిగింది. దేశంలో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నా… ప్రతిపక్షాన్ని లేకుండా చేశాం కాబట్టి.. ఏం చేసినా చెల్లుతుందనే భావనకు వచ్చేస్తున్నారు కాబట్టి… ప్రజా నిరసనల్ని కూడా లైట్ తీసుకుంటున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రజలే అవుతారు.
భయపెట్టి నోరు మెదపనీయడం లేదనుకుంటే ఓటు ఆయుధం లేదా..?
ఢిల్లీతో పాటు గల్లీల్లోనూ అదే పరిస్థితి. అధికారం చేతిలో ఉంటే.. ఎవర్నీ లెక్క చేయని తనం. ఒక్క సారి ఓటు వేశారని ఇక ప్రజలంతా ఎప్పటికీ తమతోనే ఉంటారని.. తాము ఏం చేయడానికైనా లైసెన్స్ ఇచ్చేశారని కొంత మంది మిడిమిడి జ్ఞానం పాలకులు రెచ్చిపోతూంటారు. వ్యవస్థల్ని లెక్క చేయకుండా…కావాలంటే.. వారిపై దాడులకు తెగబడి అయినా సరే… తాము చేయాలనుకున్నది చేస్తూ ఉంటారు. ప్రజలంటే కనీస వెరపు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. దేశంలో ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రజలు వ్యతిరేకించడం లేదు అనుకుని.. చెలరేగిపోతే… ఓటు అనే ఆయుధంతోనే బుద్ది చెబుతారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో భయపెట్టి.. ఎల్లకాలం వారిని కట్టడిచేయలరు. అధికారంలో ఉన్న వారికి అనుభవమయ్యే వరకూ ఆ తత్వం బోధపడదు. ఆ విషయం ఇప్పుడు.. తెలంగణ రాష్ట్ర సమితి నేతలకు అర్థమవుతోంది.. ఇతర ప్రజాస్వామ్య నేతలకూ త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దేనికైనా సమయం రావాలి.
దుబ్బాక, గ్రేటర్ ప్రజల సందేశం అర్థమవుతోందా..!?
గత ఆరేళ్లుగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయం… దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు.. ఒక్క టీఆర్ఎస్‌కే కాదు.. ఆ పార్టీ తరహా రాజకీయాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి మేలుకొలుపు. ప్రతిపక్షం లేకుండా చేసి.. ప్రజలకు తాము తప్ప.. మరో ప్రత్యామ్నాయం లేదని ఆప్షన్ పెట్టాలనుకునేవారికి కనువిప్పు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రతిపక్షం అవుతారు. తామిచ్చిన అధికారం.. అహంకారంగా మారిందని తెలుసుకున్న రోజు.. ప్రజలు తాము ఏ ఓటుతో ఆ అధికారం ఇచ్చామో.. అదే ఓటుతో దింపేస్తారు. ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది ఇదే. కానీ అధికారం అందిన తర్వాత అహంకారం తలకెక్కిన చాలా మంది దీన్ని గుర్తించడానికి ఇష్టపడకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా కళ్లు తెరుస్తారో లేదో..?