వ్యవసాయ బిల్లులపై ఇప్పుడు దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. పార్లమెంట్లో బిల్లులు ఆమోదించేటప్పుడు ఎక్కడా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు రైతులు ఆందోళనలకు దిగడంతో… అంతటా చర్చిస్తున్నారు. అసలు వ్యవసాయ చట్టాల్లో ఏముందో చాలా మందికి తెలియదు. కానీ రైతులు ఆందోళనలు చేస్తున్నారు కాబట్టి.. వారికి మద్దతివ్వాల్సిందేనని కొంత మంది ముందుకు వస్తున్నారు. మరికొంత మంది బీజేపీని వ్యతిరేకించాలి కాబట్టి రైతులకు మద్దతిస్తున్నారు. కొంత మంది మాత్రం.. వ్యవసాయ చట్టాల్లో ఏముందో వివరంగా చెబుతున్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్న వారు.. అవిఎంత ప్రమాదకరమో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ ఆరోగ్యకరమైన చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతోంది.
సివిల్ సర్వీసులను వదిలి పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన జయప్రకాష్ నారాయణ, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ ఇద్దరూ రైతులపై ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తూంటారు. ఇప్పుడు ఇద్దరూ రైతుల చట్టాలకు అనుకూలంగా ఉన్నారు. టీవీ చానళ్ల డిబేట్లలో ఇద్దరూ చట్టాలను సమర్థిస్తున్నారు. ఎందుకు సమర్థిస్తున్నామో కూడా చెబుతున్నారు. అయితే వారికి వాటిని వ్యతిరేకిస్తున్న వారి నుంచి సూటి ప్రశ్నలు వస్తున్నాయి. కార్పొరేటీకరణ దగ్గర నుంచి అనేకానేక అనుమానాలు వస్తున్నాయి. వాటన్నింటికీ ఇద్దరూ సమాధానాలు చెబుతున్నారు. అంతిమంగా ఇద్దరూ ఔట్రైట్గా ఆ బిల్లుల్ని సమర్థిస్తున్నారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు అపోహలతో ఉన్నారని అంటున్నారు.
అయితే వ్యవసాయ బిల్లులకు వీరి సమర్థన వెనుకాల.. ఇతరులు రాజకీయకోణాన్ని చూస్తున్నారు. జయప్రకాష్ నారాయణకు మొదటి నుంచి మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఆయన బీజేపీ తరపున జాతీయ స్థాయిలో ఏదో ఓ నామినేటెడ్ పదవిపొందుతారన్న ప్రచారం కూడా జరిగింది.కానీ అలాంటిదేమీ లభించడం లేదు. తాజాగా వ్యవసాయ బిల్లులకు ఆయన మద్దతు వెనుక కూడా ఈరాజకీయం ఉంటుందన్నారు. ఇక జేడీ కూడా.. కొద్ది రోజులుగా బీజేపీలో చేరుతారన్న ప్రచారం ఉంది. ఇవన్నీ కొంత మంది బయటకు తీసి.. వారి చర్చల్లో రాజకీయ కోణం చూస్తున్నారు.