వైసీపీ నేతలు ఏం జరిగినా చంద్రబాబే కారణమని అంటూ ఉంటారు. తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు కూడా.. ముందస్తు ఎన్నికల వరకూ అదే చెప్పారు. ఇప్పుడు.. భారతీయ జనతా పార్టీలో తిరిగి చేరిన విజయశాంతి కూడా.. చంద్రబాబు వల్లే గతంలో బీజేపీకి రాజీనామా చేశానని చెబుతున్నారు. చంద్రబాబు ఏం చేశారంటే… తెలంగాణను వ్యతిరేకించారట..!. తన రాజకీయ జీవితాన్ని భారతీయ జనతా పార్టీతో ప్రారంభించిన విజయశాంతి.. ఆ తర్వతా సొంత పార్టీ.. టీఆర్ఎస్.. కాంగ్రెస్ మీదుగా.. మళ్లీ బీజేపీలో చేరారు. మొదట్లో బీజేపీని ఎందుకు వీడాల్సి వచ్చిందంటే… అప్పట్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. తెలంగాణను వ్యతిరేకించారని.. అందుకే తాను.. బీజేపీకి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకున్నానని చెబుతున్నారు.
మరి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరడానికి.. మళ్లీ కాంగ్రెస్‌లో చేరడానికి మాత్రం చంద్రబాబు కారణం అని విజయశాంతి చెప్పడం లేదు. ఢిల్లీలో నడ్డాతో కండువా కప్పించుకుని తెలంగాణకు వచ్చిన ఆమె.. తొలిసారి బీజేపీ ఆఫీసుకు వెళ్లారు. ఆ సందర్భంగా కొత్తగా చేరిన పాత పార్టీకి మద్దతుగా .. ఇతర పార్టీలపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. అమరవీరుల శవాలపై కూర్చుని కేసీఆర్ పాలన చేస్తున్నారని .. టీఆర్ఎస్ కనుమరుగవటం ఖాయమని జోస్యం చెప్పారు.
కేసీఆర్…తన కంటే కంటే గొప్ప నటుడని ..తనను రాజకీయాల నుంచి తప్పించేందుకు కేసీఆర్ ప్రయత్నించారని ఆరోపించారు. ఏ పార్టీ బలంగా ఉందనుకుంటే ఆ పార్టీలో చేరడం విజయశాంతి నైజమని.. ఆమె పార్టీ మారినప్పుడల్లా నేతలు విమర్సిస్తూ ఉంటారు. కానీ తెలంగాణ కోసం… తాను పార్టీలు మారుతున్నానని విజయశాంతి చెబుతూ ఉంటారు. కొసమెరుపేమిటంటే.. ఆమె చేరిన ఏ పార్టీ కూడా.. అధికారంలోకి రావడం.. ఆమెకు పదవి ఇవ్వడం లాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. గతంలో మోడీని టెర్రరిస్ట్‌తో పోల్చారు.. శశికళ జైలుకెళ్లే సమయంలోనూ బీజేపీపై మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు బీజేపీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.