ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల తిరుపతి ఉపఎన్నిక గురించి మాట్లాడటం తగ్గించేశారు. ప్రస్తుతం రాయలసీమలోనే ఉన్న సోము వీర్రాజు.. కడపలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అందులో రాయలసీమ ప్రాజెక్టులకు పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చినట్లే నిధులిస్తామని పదే పదే చెబుతున్నారు. రాజకీయంగా బలపడతామని చెబుతున్నారు కానీ తిరుపతిలో పోటీ చేస్తామో లేదో మాత్రం చెప్పడం లేదు. ఇదే సోము వీర్రాజు.. రెండు వారాల కిందట.. తిరుపతిలో పోటీ చేసేది తామేనని.. ప్రకటించుకున్నారు. అంతే కాదు.. తిరుపతిలోనే కొన్ని రోజులు మకాం వేశారు. ఆయనకు తోడు జీవీఎల్ కూడా వచ్చారు.
తిరుపతిని తామే అభివృద్ధి చేశామని బీజేపీ నేతలు చెప్పడం ప్రారంభించారు. ఓ సందర్భంలో జీవీఎల్ కేంద్ర సంస్థల అధికారులతో సమీక్ష కూడా నిర్వహించేశారు. అయితే.. అదే సమయంలో.. జనసేన పార్టీ తాము కూడా పోటీ చేస్తామని.. రంగంలోకి రావడంతో సీన్ మారిపోయింది. బీజేపీ నేతల దూకుడు తగ్గింది. రెండు పార్టీల నేతలతో కమిటీ వేసి.. నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. కమిటీని నియమించారా.. ?ఆ కమిటీలో ఎవరున్నారు..? అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పుడు బీజేపీ నేతలు ముఖ్యంగా సోము వీర్రాజు.. తిరుపతి ఉపఎన్నికపై మాట్లాడటం మానేశారు.
తెలంగాణలో దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ జాబితాలో తిరుపతిని చేర్చేసి.. హడావుడి చేసిన ఏపీ బీజేపీ నేతలకు ఎందుకు ముకుతాడు పడిందో.. సస్పెన్స్‌గా మారింది. జనసేనకు సీటు కేటాయించాలని నిర్ణయించడం వల్లనా లేక… ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించే వరకూ.. సైలెంట్ గా ఉండాలనే ఒప్పందం జరగడం వల్లనా.. అన్నది చర్చనీయాంశంగా మారింది.