రజనీకాంత్ రాజకీయ అరంగేట్రానికి సర్వం సిద్ధం అవుతోంది. డిసెంబరు 31న రజనీ రాజకీయాల్లోకి అఫీషియల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆరోజునే పార్టీ జెండా, గుర్తు.. ఇవన్నీ బయటకు రానున్నాయి. పార్టీ గుర్తు ఏమైతే బాగుంటుందన్న విషయంలో రజనీ తన సన్నిహితులతో తర్జనభర్జనలు పడుతున్నారు. పార్టీ గుర్తు చూడగానే… `ఇది సామాన్యుల పార్టీ` అనే నమ్మకం ప్రజల్లో కలగాలన్నది రజనీ ఆలోచన. అందుకే ఆయన సైకిల్ గుర్తు ఎంచుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సైకిల్ అంటే ఉత్తి సైకిల్ మాత్రమే కాదు. వెనుక పాల క్యాను కూడా ఉంటుందట. రజనీకాంత్ `అన్నామలై` చిత్రంలో (తెలుగులో కొండపల్లి రాజా గా రీమేక్ అయ్యింది) పాలక్యాన్ ఉన్న సైకిల్ తో కనిపిస్తాడు. అలాంటి గుర్తే.. రజనీ ఎంచుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తన పార్టీ జెండాకి మూడు రంగులు ఉంటాయని, ఒకొక్క రంగుకీ ఒక్కో ప్రత్యేక లక్షణం ఉండేలా రజనీ ప్లాన్ చేస్తున్నారని, ఒకట్రెండు రోజుల్లో పార్టీ జెండా, గుర్తులపై రజనీ ఓ నిశ్చితాభిప్రాయానికి వస్తారని తెలుస్తోంది. సైకిల్ గుర్తు తెలుగునాట పాపులర్. ఆ గుర్తుతోనే సినీ నటుడిగా ఉన్న ఎన్టీఆర్ రాజకీయ నేతగా మారి అద్భుతాలు సృష్టించారు. ఇప్పుడు అదే సైకిల్ పై రజనీ కూడా రాజకీయ ప్రయాణం మొదలెట్టబోతున్నారన్నమాట.