ఆస్తులు అమ్మి అయినా పోలవరంలో విగ్రహాలు.. ఓటు బ్యాంకుకు నగదు బదిలీ పథకాలు అమలు చేసి తీరాల్సిందేనని పట్టుదలగా ఉన్న ఏపీ ప్రభుత్వానికి న్యాయపరమన చిక్కులు చికాకు తెప్పిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆస్తులు అమ్మడానికి బిల్డ్ ఏపీ పేరుతో తీసుకొచ్చిన పథకంపై పది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అయితే తాము ప్రజా ప్రయోజనం కోసమే అమ్ముతున్నామని ప్రభుత్వ లాయర్లు కోర్టుల్లో వాదిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. అదే సమయంలో… కొన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై వేసిన కౌంటర్లలో ప్రభుత్వం… ప్రస్తుతం ప్రకటించినవే కాకుండా మరికొన్ని విలువైన ఆస్తులను కూడా వేలం వేస్తామని వెల్లడించింది.
వీటిపై జరిగిన విచారణలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఏమైనా ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆస్తులు విక్రయించి నిధులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ఆరా తీసింది. దేశంలో ఎవరూ చేయని సంక్షేమ కార్యక్రమాలు ఏపీ ప్రభుత్వం చేస్తుందని ప్రభుత్వలాయర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తుపాన్ షెల్టర్లను కూడా అమ్మకానికి పెట్టిన విషయాన్ని ఓ పిల్ తరపున వాదించిన న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
తుపాన్ షెల్టర్లను కూడా చివరికి వదలడం లేదా అని హైకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. దాఖలైన అన్ని పిల్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్కెట్లు, క్వార్టర్స్ తో పాటు.. ప్రజలకు ఉపయోగకరమైన వాటిని కూడాప్రభుత్వం అమ్మకానికి పెట్టడం.. చాలా రోజులుగా విమర్శలకు కారణం అవుతోంది. కోర్టు పిటిషన్లు పడటంతో ఇంకా అమ్మకాలు పూర్తి కాలేదు.