ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్లాని సీనియర్ నేతలు నిర్ణయించుకున్నారు. అయితే నాలుగు జిల్లాలంటే మరీ తక్కువ అవుతుందేమోనని.. మరో రెండు జిల్లాలు కలుపుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తాము ముందుకెళ్తామని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి ఈ విషయంలో చాలా దూకుడుగా ఉన్నారు. ఆయన పుస్తకాలు కూడా రాస్తున్నారు. “జై గ్రేటర్ రాయలసీమ” పుస్తకం రాసేశారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. గ్రేటర్ రాయలసీమకు కోసం ఉద్యమించాలనుకుంటున్న వారిలో మైసూరారెడ్డి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, శివారెడ్డి ఉన్నారు.
రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కూడా కలుపుకుంటున్నారు. నెల్లూరు జిల్లా నుంచి దినేష్ రెడ్డి వారి బ్యాచ్‌లో ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఎవరూ లేరు. పోలీస్ అధికారిగా పనిచేస్తోన్న సమయంలోనే రాయలసీమ నాయకుల బలాన్ని చూశానని.. అందుకే… నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని వీరు కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు వచ్చినప్పటి నుంచి వీరంతా కలిసి.. ప్రత్యేక రాయలసీమ కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. విశాఖకు రాయలసీమకు సంబంధమే లేదని.. హైకోర్టు వద్దు.. ప్రత్యేక రాష్ట్రమే కావాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని యువత ముందుకు తీసుకెళ్ళాలని పిలుపునిస్తున్నారు.
అప్పుడప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీడియా మీట్లు పెడుతున్నారు. కానీ ఎప్పుడూ క్షేత్ర స్థాయిలో ఏదైనా కార్యక్రమాలు పెట్టే ప్రయత్నం చేయడం లేదు. దీంతో.. రాజకీయంగా ప్రాధాన్యత దక్కని నేతలు.. చేస్తున్న ప్రయత్నాలుగా మిగిలిపోతున్నాయి. గతంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా పెద్ద పార్టీ పెట్టి పెద్ద ఎత్తున తిరిగారు. కానీ ప్రజల స్పందన లేకపోవడంతో లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు.