చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రాబల్యం ఉన్న గ్రామాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడుల పరంపర కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో అక్కడ చోటు చేసుకున్న ఘటనలు సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత ఇటీవల జనసేన పార్టీకి చెందిన మహిళా నేత ఇంటిపై దాడి చేసిన ఘటన కూడా కలకలం రేపింది. పెద్దిరెడ్డిపై పోస్టు పెట్టారన్న కారణంగా సోషల్ మీడియా కార్యకర్తల్నీ వదిలి పెట్టడం లేదు. ఈ రోజు చనిపోయిన తమ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై తంబళ్లపల్లిలో దాడి జరగడం సంచలనం సృష్టిస్తోంది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు తంబళ్ళపల్లెకు వెళ్తున్న సమయంలో వారు వస్తున్నారని తెలిసి ప్రణాళిక ప్రకారం.. మాట వేసిన వంద మందికిపైకి వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడులకు దిగారు. పలువురికి గాయాలయ్యాయి.
దీంతో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. అయితే పోలీసులు రాళ్లు వేసిన వారిని పట్టుకోలేదు. ధర్నా చేస్తున్నారని టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన పై చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పోలీస్ స్టేషన్లను పెద్దిరెడ్డి కుటుంబానికి అప్పచెప్పాలని టీడీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీలోని అరాచక,అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్నందు వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు.
కడపలో కూడా లేనంత ఉద్రిక్త పరిస్థితులు మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గాల్లో ఏర్పడుతున్నాయి. ఆయన అండ లేకుండా.. ఆయన అనుచరులు దాడులు చేసే అవకాశం ఉండదు. అక్కడి పోలీసులు కూడా.. వైసీపీ నేతలు దాడులు చేసిన సైలెంట్ గా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ సమాంతర రాజ్యాన్ని పెద్దిరెడ్డి నడుపుతున్నారన్న విమర్శలు విమర్శిస్తున్నాయి.