పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద గండాన్ని గట్టెక్కినట్లుగా కనిపిస్తోంది. ఎలాగైనా.. పెరిగిన అంచనాలను ఆమోదించుకోవాలన్న లక్ష్యంతో మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమయ్యారు. ఆయన వెంట నీటి పారుదల మంత్రి అనిల్ కూడా ఉన్నారు. భేటీ తర్వాత వారి ముఖాల్లో వెలుగు కనిపించింది. మారిన అంచనాలకు కేంద్ర జలసంఘం ఆమోదం లభించిందని.. కేంద్ర ఆర్థికశాఖ నుంచి కూడా అనుమతులు రానున్నాయని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు గతంలో ప్యాకేజీకి ఒప్పుకోవడంతోనే సమస్య వచ్చిందని.. ఇప్పుడా చిక్కు ముళ్లన్నింటినీ విప్పుతున్నామన్నారు.
కేంద్రం చెప్పినట్లుగా ఇరవై వేల కోట్లతో ప్రాజెక్ట్ పూర్తయ్యే పరిస్థితి లేదని.. సవరించిన అంచనాలను ఆమోదించాల్సిందేనని.. బుగ్గన పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. పీపీఏ సమావేశంలోనూ.. తక్కువ మొత్తానికి కాదని మినిట్స్‌లో పొందు పరిచారు. అయితే.. పెరిగిన మొత్తం ఇవ్వాలని సిఫార్సు చేయలేదు. దీంతో.. ఎలాగైనా… పెంచిన అంచనాలను ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. పలుమార్లు ఢిల్లీకి వచ్చిన బుగ్గన పనులు పూర్తి చేస్తున్నారు. సానుకూలంగా స్పందించారని చెప్పిన బుగ్గన.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు రావాలని షెకావత్‌ను కోరారు.
ఆయన 15 రోజుల్లో వస్తానని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని సమాచారం అందిన తర్వాత.. సీఎం జగన్ పోలవరం పర్యటన ఖరారయింది. సోమవారం ఆయన పోలవరంలో క్షేత్ర స్థాయిలో పర్యటించాలని నిర్ణయించారు. పోలవరం పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్ట్ సంస్థను ఇప్పటికే ఆదేశించారు. పోలవరానికిసంబందించి ఇప్పటికీ ఇవ్వాల్సిన నిధులను.. ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టేలా ప్రత్యేక ఖాతా ద్వారా విడుదల చేయనున్నారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని తేల్చినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.