తెలంగాణ సీఎం కేసీఆర్ సడన్‌గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఇలా ఢిల్లీ వెళ్లగానే అలా అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయి. అదే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి .. ఢిల్లీకెళ్లి పడిగాపులుపడిన తర్వాత మాత్రమే అపాయింట్మెంట్లు లభిస్తాయి. సీఎం కేసీఆర్ మాత్రం వ్యూహాత్మకంగానే ఉన్నారు. ముందస్తుగా పక్కాగా అపాయింట్మెంట్లు ఖరారు చేసుకుని ఢిల్లీ చేరుకున్నారు. ముందుగా షెకావత్‌తో ఆ తర్వాత అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏ ఏ అంశాలపై చర్చించారో మీడియాకు సమాచారం లేదు కానీ… రాష్ట్రానికి సంబంధించిన అంశాలు.. వరద సాయంపై చర్చించారని. టీఆర్ఎస్ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. కానీ కేసీఆర్.. బీజేపీ అగ్రనేతలతో… ఏకాంత సమావేశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు గా తెలుస్తోంది.
రాష్ట్రానికి సంబంధించిన అంశాలైతే… అధికారులను, సంబంధిత మంత్రులను తీసుకెళ్తారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్.. తన పర్యటనలో మంత్రులు, ఎంపీలుఎవర్నీ రావొద్దని ముందుగానే చెప్పేశారు. కొద్ది మంది అదికారుల్ని మాత్రం వెంట తీసుెళ్లారు. వారిని సమావేశాల్లో పెద్దగా ఇన్క్లూడ్ చేయడం లేదు. తాను మాత్రమే బీజేపీ నేతలతో సమావేశం అవుతున్నారు. షెకావత్‌తో దాదాపుగా గంట సేపు కేసీఆర్.. ఏకాంతంగా సమావేశమయ్యారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షాతో నూ అంతేనని అంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయన బీజేపీని బద్మాష్‌గా చెబుతూ.. జాతీయ స్థాయి పోరాటం చేస్తానని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో బీజేపీ నేతలతో ఆయన పర్యటనలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.
దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ప్రభావం కేసీఆర్ పై గట్టిగానే పడిందన్న అభిప్రాయం ఇప్పటికే తెలంగాణ రాజకీయవర్గాల్లో ఉంది. ఆయన బీజేపీతో.. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ విధానాన్ని కోరుకుంటున్నారన్న చర్చ ప్రారంభమయింది. అయితే.. ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో పుంజుకుంటున్నందున… కేసీఆర్ ఆఫర్ చేసే దోస్తీని బీజేపీ పట్టించుకోదని కూడా చెబుతున్నారు. అయితే బీజేపీ హైకమాండ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో… కేసీఆర్ ఏ ఉద్దేశంతో బేటీలు నిర్వహిస్తున్నారో.. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.