వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. విమర్శించి… ఆరోపించి.. పోరాడిన సమస్యలన్నింటిపై అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకోక తప్పడం లేదు. సంప్రదాయేతల ఇంధన విద్యుత్ ఒప్పందాల్లో నాటి ప్రభుత్వం పాతికేళ్లు పీపీఏ చేసుకుంటే.. దాన్ని విమర్శించిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏకంగా 30 ఏళ్లకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. అక్కడ్నుంచి ప్రారంభించి జీఎంఆర్ ఎయిర్ పోర్టు వరకూ అదే పరిస్థితి. అవినీతి.. అవినీతి అని ఆరోపించిన వాటినల్లా… చేయాల్సి వస్తోంది. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న దివీస్ పరిశ్రమ విషయంలోనూ అదే యూటర్న్ తప్పడం లేదు.
ప్రతిపక్షంలో ఉండగా కాలుష్యం వెదజల్లే పరిశ్రమ అని.. కోనసీమలో ఆ పరిశ్రమ ఉండటానికి వీల్లేదని… జగన్మోహన్ రెడ్డి సహా.. ఆ పార్టీ నేతలంతా దివీస్ మీద పోరాడారు. తాము అధికారంలోకి వస్తే.. ఆ పరిశ్రమలన్నింటినీ దూరంగా తరలిస్తామన్నారు. దివీస్ విషయంలో ఆ పోరాటం ఓ రేంజ్లో జరిగింది. ఇప్పుడు సీఎం అయ్యాక దివీస్ ఫార్మా యూనిట్‌కు సీఎం జగన్ స్వయంగా శంకుస్థాపన చేయబోతున్నారు. దివీస్‌కు వ్యతిరేకంగా టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని… పొల్యూషన్ లేకుండా చర్యలు తీసుకుంటామని దివీస్ హామీ ఇవ్వడంతో చంద్రబాబు సర్కార్ భూములను కేటాయించింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సిఫారసుల మేరకు.. దివీస్‌కు ప్రత్యేక రాయితీలు కూడా ప్రకటించారు. కానీ.. ఆందోళనల కారణంగా ఇప్పటి వరకూ దివీస్ పరిశ్రమ పనుల్నిప్రారంభించలేకపోయింది. జగన్ సీఎం అయిన రెండేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. అన్ని అనుకూలంగా మార్చేసుకుని పరిశ్రమకు … జగన్‌తోనే శంకుస్థాపన చేయబోతున్నారు.
ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్న వాదన ఏమిటి అంటే.. దివీస్ వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు. పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసి, సముద్రపు నీటిలో ఉండే ఉప్పు శాతం కంటే తక్కువ స్థాయికి తెచ్చి పైప్‌లైన్ ద్వారా సముద్రంలో కలుపుతారు. దీనివల్ల మత్స్య సంపదకు, భూగర్భ నీటికి ఎటువంటి హాని కలగదు..అని ప్రచారం చేస్తున్నారు. నిజానికి దివీస్ పరిశ్రమపై స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే గతంలో వ్యతిరేకించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సమర్థిస్తున్నారు. కొసమెరుపేమిటంటే… అప్పట్లో పరిశ్రమ కోసం భూమి కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. ఆ పరిశ్రమను.. వైసీపీ గతంలో చెప్పినట్లుగా తరలించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో రాజకీయం మళ్లీ రాజుకుంటోంది.