డిటెక్టీవ్ కథలెప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఓ నవల చదువుతున్న ఫీలింగ్ కలిగిస్తాయి. కొంచెం ఫన్.. కొన్ని ట్విస్టులు ఉంటే చాలు. తప్పకుండా వర్కవుట్ అవుతాయి. మన తెలుగులో ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ వచ్చింది కదా..? అలా. కన్నడలో కూడా ఆ తరహా సినిమా ఒకటి తీశారు. `బెల్ బాటెమ్` పేరుతో. ఇప్పుడు అదే పేరుతో ఈ సినిమాని తెలుగులో డబ్ చేశారు. ఆహాలో ఈ సినిమా చూడొచ్చు. మరి ఫన్నీ, ట్విస్టుల్నీ `బెల్ బాటెమ్`లో ఎంత వరకూ ఆశించొచ్చు..? ఈ సినిమా కథేమిటి?
దివాకర్ (రిషబ్ శెట్టి)కి చిన్నప్పటి నుంచీ డిటెక్టీవ్ కావాలని ఆశ. డిటెక్టీవ్ నవలలు చూస్తూ, ఆ సినిమాలు చూస్తూ.. అలానే ఆలోచించడం మొదలెడతాడు. నాన్న ఓ కానిస్టేబులు. తన బలవంతంపై ఇష్టం లేకపోయినా కానిస్టేబుల్ గా మారాల్సివస్తుంది. స్టేషన్ లో అంతా తనని `ఎల్` బోర్డు అంటూ ఆట పట్టిస్తుంటారు. స్టేషన్ లో ఉన్నవాళ్లందరికీ చాకిరీ చేసీ చేసీ విసుగొస్తుంది. అయితే ఈలోగా ఓ మిస్సింగ్ కేసు తనకి అప్పగిస్తే, దాన్ని విజయవంతంగా సాల్వ్ చేస్తాడు. ఆ ప్రాంతంలో కొన్ని వరుస దొంగతనాలు జరుగుతుంటాయి. అదీ.. పోలీస్స్టేషన్లో. రికవరీ చేసిన మాల్ ని ఎవరో చాకచక్యంగా ఎత్తుకుపోతుంటారు. పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగితే.. ఇక పోలీసుల పరువేం కాను..? అందుకే ఈ కేసుని దివాకర్కి అప్పగిస్తారంతా. మరి డిటెక్టీవ్ దివాకరం… ఆ దొంగల్ని పట్టుకున్నాడా? లేదా? అనేది మిగిలిన స్టోరీ.
కథ ప్రారంభించిన విధానం.. చాలా సరదాగా ఉంటుంది. తెరపై తెలిసిన నటులెవరూ ఉండరు. అయినా సరే, ఈజీగానే కథతో ప్రయాణం మొదలెట్టేస్తాం. డిటెక్టీవ్ దివాకరం బిల్డప్పులు ఇస్తూ ఇస్తూ.. గోతిలో పడడం దగ్గర్నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆయా సన్నివేశాలు సరదాగా ఉండడంతో.. కాలక్షేపానికి ఢోకా ఉండకుండా పోతుంది. పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగిన దగ్గర్నుంచి ట్విస్టులు మొదలవుతాయి. ఆ కేసు దివాకరం చేపట్టడం, ఒకొక్కరినీ విచారణ చేయడం.. కొన్ని క్లూలు సంపాదించడం.. ఇవన్నీ సాగదీత వ్యవహారాల్లా కనిపిస్తాయి. మంచి ప్రారంభాన్ని దర్శకుడు మిస్ చేసుకున్నాడన్న భావన కలుగుతుంది. అయితే… ప్రధమార్థంలో ఏవైతే పాత్రలు చూపించాడో… వాటిని ద్వితీయార్థంలోని కీలకమైన సమయాల్లో వాడుకున్నాడు దర్శకుడు. కాబట్టి… ఆయా పాత్రలకు, సన్నివేశాలకూ కాస్తో కూస్తో న్యాయం చేసినట్టే అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో అసలు ఈ దొంగతనాలు ఎందుకు జరిగాయి? అనే విషయాన్ని చూపించారు. అది దర్శకుడు తన కన్వెన్సింగ్ కోసం రాసుకున్న సీన్లలానే అనిపిస్తాయి. అసలు నేరస్థుడు దొరికాక.. వాడి వెనుక ఓ పాజిటీవ్ స్టోరీ పెట్టడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఈసారీ అదే పద్ధతి వాడుకున్నారు. ప్రతీ దొంగతనం వెనుక..ఓ సామాజిక కోణం ఉండాల్సిన అవసరం లేదన్న విషయం దర్శకులు గుర్తు పెట్టుకుంటే.. ఇలాంటి కథల ముగింపులు వేరేలా ఉంటాయి. హరి ప్రియతో లవ్ ట్రాక్, ఇన్వెస్టిగేషన్ పద్ధతి ఇంకాస్త బాగా రాసుకోవాల్సిందే. ఫన్ ఉన్నా.. సరిపడినంత కనిపించలేదు. ట్విస్టులు ఉన్నా – డోసు ఇంకాస్త పెరగాల్సింది. కాకపోతే.. బోర్ కొట్టించకుండా చూసుకోగలిగాడు.
కన్నడ సినిమాలన్నీ లో బడ్జెట్ తో తీసేవే. ఇదీ అంతే. బ్లూ మేట్లో ఎక్కువ సన్నివేశాల్ని నడిపించినట్టు తెలిసిపోతుంటుంది. దర్శకుడిలో విషయం ఉంది. సెటైరికల్ సీన్లు బాగా రాసుకోగలిగాడు. వాటి ద్వారానే వినోదం పండింది. కాకపోతే…ఇంకాస్త క్వాలిటీగా తీయాల్సిన సినిమా ఇది. కొన్ని డైలాగులు బాగా నవ్విస్తాయి. తండ్రీ – కొడుకుల మధ్య సీన్లు బాగా రాసుకోగలిగాడు.
రిషబ్ శెట్టి తెలుగువాళ్లకు పూర్తిగా కొత్త. తన వరకూ దివాకరం పాత్రలో ఇమిడిపోయాడు. హరిప్రియ తెలుగువాళ్లకు తెలిసిన ఫేసే. ఈ సినిమాలో తెలుగువాళ్లకు తెలిసిన మెహం ఆమెది మాత్రమే. కథానాయిక పాత్రని ఇంట్రస్టింగ్ గానే తీర్చిదిద్దారు. మిగిలినవాళ్లంతా ఓకే అనిపిస్తారు.
స్క్రిప్టు దశలో.. `ఇంత సరిపోతుందిలే..` అని తృప్తి పడిపోయినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది.. `ఆవు ఉచ్చపోస్తున్నప్పుడ చీమకు అది… జలపాతంలానే కనిపిస్తుంది` అని. ఏ వృక్షం లేని చోట.. ఆముద చెట్టే మహా వృక్షం అయిపోతుంది. అలా.. కన్నడలో.. ఈ సినిమా మహత్తర విజయం సాధించేసింది. అలాగని కన్నడలో మంచి సినిమాలు రావని కాదు. ఈ తరహా డిటెక్టీవ్ సినిమాలు అక్కడ రాలేదు. మన `ఆత్రేయ..` వాళ్ల వరకూ వెళ్లి ఉండదు. కాబట్టి వాళ్లకు దివారకరమే గొప్పగా కనిపించాడు. అందుకే ఈ సినిమా కన్నడలో సూపర్ డూపర్ హిట్టయ్యింది. `బెల్ బోటెమ్`ని డబ్ చేయకుండా, ఆ హక్కుల్ని తీసుకుని, కాస్త పాలీష్ చేసి, ఇంకాస్త ఫన్ జోడించి తెలుగులో తీసుకుంటే.. తప్పకుండా మంచి ఫలితం వచ్చి ఉండేది.