తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి విచిత్రంగా మారిపోయింది. బీజేపీ .. అధికార పార్టీపై పోరాడుతూ.. ప్రతిపక్షంగా మారిపోతే.. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తమలో తాము కొట్టుకుంటూ.. చివరికి పార్టీని ఎక్కడదాకా తీసుకెళ్తారో కూడా ఊహించలేపోతున్నారు. పతనమైపోతున్న కాంగ్రెస్ దీన స్థితిని అర్థం చేసుకుని… పార్టీ హైకమాండ్ చెప్పినట్లుగా వినుకుందామన్న ఆలోచన ఒక్కరికీ లేదు. తమ అంతర్గత రాజకీయాలు తాము చేసుకుంటున్నారు. కొత్త పీసీసీ చీఫ్ పదవి ఎక్కడ రేవంత్ రెడ్డికి ఇస్తారోనని వారంతా కంగారు పడిపోతున్నారు. ఆయన వెనుక కుట్రలు చేయడానికి ఇతర పార్టీ నేతలంతా.. కలసికట్టుగా మారిపోయారు. వీరిలో పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం తాము రేసులో ఉన్నామంటే.. తాము రేసులో ఉన్నామని చెప్పుకునేవారే ఎక్కువ మంది ఉన్నారు.
మూడురోజుల పాటు కొత్త పీసీసీ చీఫ్ అధ్యక్ష పదవి ఎంపికపై అభిప్రాయాలు సేకరించిన ఇంచార్జి మాణిగం ఠాగూర్ ఢిల్లీకి వెళ్తున్నారు. వెళ్లే ముందు కూడా.. సీనియర్లు రచ్చ చేశారు. పార్టీ నేతల నుంచి సేకరించిన అభిప్రాయాల్లో రేవంత్ రెడ్డి పేరుకే ఎక్కువ సానుకూలత లభించిందని… సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు. అంతే.. ఆ పోస్టింగ్‌ను పట్టుకుని భట్టి విక్రమార్క సహా సీనియర్లు హుటాహుటిన ఠాగూర్ వద్దకెళ్లిపోయారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో అన్ని రకాల ప్రచారాలు చేసేవాళ్లు ఉంటారు. చర్యలు తీసుకోవడానికి మాణిగం ఠాగూర్ ఎవరు..?. వారి ఉద్దేశం.. రేవంత్ కు అనుకూలంగా పోస్టింగ్స్ ఉన్నాయి కాబట్టి.. ఆయనపై చర్య తీసుకోవాలని కోరడమే.
మాణిగం ఠాగూర్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి… నేతల తీరుపై ఓ క్లారిటీ వచ్చేసినట్లుగా ఉంది. ఆయన అందర్నీ ఎక్కడ ఉంచారో అక్కడే ఉంచుతున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి పేరును హైకమాండ్ ఖరారు చేసిందని… సంప్రదింపులు జరిపి.. అందరి ఆమోదంతోనే ప్రకటించామన్న దాని కోసమే కసరత్తు జరుగుతోందని గాంధీభవన్‌లో బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అందుకే.. తమ సపోర్ట్ లేదని చెప్పేందుకు సీనియర్లు తహతహలాడుతున్నారని అంటున్నారు. మొత్తానికి టీ కాంగ్రెస్ కొన ఊపిరితో ఉన్నా… ప్రాణం పోయ్యే వరకు ఆ పార్టీ నేతలు తమ సహజసిద్ధమైన రాజకీయాన్ని మాత్రం వదిలి పెట్టే అవకాసం కనిపించడం లేదు.