ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుధా కొంగర… `రతన్ టాటా బయోపిక్ తీయాలనివుంది` అంటూ మనసులోని మాట బయటపెట్టింది. అప్పటి నుంచీ.. ఈ బయోపిక్‌పై ఆసక్తికరమైన కథనాలు వండి వార్చడం మొదలెట్టింది మీడియా. రతన్ టాటా బయోపిక్‌లో ఎవరెవరు నటించే అవకాశం ఉంది? అంటూ.. కొన్ని ఊహాగానాలకు తెరలేపింది. అందులో భాగంగా మాధవన్ ఈ బయోపిక్ చేయనున్నట్టు కొన్ని వార్తలు పుట్టికొచ్చాయి. అభిమానులు కాస్త ముందడుగు వేసి, రతన్ టాటా గెటప్పులో మాధవన్ ఫొటోల్ని మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వదిలిపెట్టారు.
దీనిపై ఇప్పుడు మాధవన్ స్పందించక తప్పలేదు. రతన్ టాటా బయోపిక్ లో తాను నటించడం లేదని, నిజానికి అలాంటి.. ప్రతిపాదన ఏమీ తన దగ్గరకు రాలేదని, ఈ బయోపిక్ పై వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని తేల్చేశాడు. సుధా కొంగర దగ్గర కూడా రతన్ టాటా బయోపిక్ చేయాలన్న ఆలోచన మాత్రమే ఉంది. ఆమె దగ్గర కూడా ఎలాంటి స్క్రిప్టూ లేదు. అయినా సరే, వార్తలు మాత్రం పుట్టుకొచ్చేశాయ్. మాధవన్ ముందే కాస్త తేరుకుని, స్పందించడంతో ఈ వార్తలకు చెక్ పెట్టినట్టైంది.