జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా నిర్వీర్యం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఓ పద్దతి ప్రకారం వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో పోటీకి సిద్ధమైన ఆయనను … జాతీయ స్థాయి నాయకులతో చెప్పించి.. పోటీ నుంచి విరమించారు. బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని చెప్పించారు. అవసరం తీరిపోయిన తర్వాత పవన్ కల్యాణ్‌ను మేము అడగలేదు.. ఆయనే వచ్చి మద్దతిచ్చారన్నట్లుగా మాట్లాడటం ప్రారంభించారు. పవన్‌ను కనీసం ప్రచారానికి కూడా పిలువలేదు. అచ్చంగా అదే తరహాలో తిరుపతి ఉపఎన్నిక విషయంలోనూ… బీజేపీ వ్యవహరిస్తోంది. ఓ వైపు ఉమ్మడి అభ్యర్థిపై కమిటీ వేసి చర్చించుకుంటామని చెబుతూనే.. మరో వైపు బీజేపీ అభ్యర్థే బరిలో ఉంటారని ప్రకటిస్తున్నారు.
తిరుపతిలో బీజేపీ అభ్యర్థేనని సోము వీర్రాజు ఏకపక్ష ప్రకటన..!
తిరుపతిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో సోము వీర్రాజు అన్ని అంశాలతో పాటు తిరుపతి ఉపఎన్నికపైనా మాట్లాడారు. ఆ మాటలు సూటిగా సుత్తి లేకుండా ఉన్నాయి. జనసేన మద్దతుతో తిరుపతిలో బీజేపీనే పోటీ చేస్తుందని డిక్లేర్ చేసేశారు. దీంతో జనసేన నేతల్లో ఒక్క సారిగా అసహనం ప్రారంభమయింది. రెండు పార్టీలు ఉమ్మడి కమిటీని నియమించుకుని.. చర్చల ద్వారా.. ఏ పార్టీ అభ్యర్థి ఉండాలో ఖరారు చేసుకుందామని… జేపీ నడ్డా సమక్షంలో అంగీకరించారని ఇప్పుడు.. బీజేపీ ఏకపక్షంగా తానే పోటీచేస్తానని ప్రకటించడం ఏమిటని.. జనసేన నేతల్లో ఆగ్రహం ప్రారంభమయింది. సోము వీర్రాజు జనసేనను ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారని, ప్రకటించిన తర్వాత పవన్ కల్యాణ్‌కు జాతీయ స్థాయి నేతలతో బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని చెప్పించేలా చేస్తామని అయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
జనసేన అభిప్రాయాలను అంత తేలికగా తీసుకుంటారా..!?
పొత్తులో ఉన్న పార్టీకి కనీస గౌరవం కూడా ఇవ్వరా..? అన్న అక్రోశం జనసేన నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది. నిజంగా తిరుపతిలో బీజేపీ నేతలే పోటీ చేయాలనుకుంటే… జనసేన అంగీకారంతో సంయుక్తంగా ప్రకటిస్తే వచ్చే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. బీజేపీ ఏకపక్షంగా ప్రకటించుకునేసరికి… అది రాజకీయ వ్యూహంగామారిపోయిందని జనసైనికులు అంటున్నారు. పవన్ కల్యాణ్ లాంటి జనాకర్షణ నేత ఉన్న పార్టీని ఇంత దారుణంగా అవమానించడం ఏమిటన్న చర్చ కూడా జనసైనికుల్లో ప్రారంభమయింది. బీజేపీ తీరుపై జనసేన నాయకత్వం ఏమనుకుంటుందో కానీ.. కింది స్థాయి కార్యకర్తలు మాత్రం… తాము అవమానానికి గురైనట్లుగా ఫీలవుతున్నారు.
పొత్తు ధర్మం పాటించరా..? అభ్యర్థిని జనసేన ప్రకటించుకోలేదా..?
కారణం ఏదైనా… సందర్భం లేకపోయినా… పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తుకు వెళ్లారు. పొత్తును ఆయన గౌరవిస్తున్నారు. చర్చలు జరిపి క్లారిటీ వచ్చే వరకూ అధికారికంగా ప్రకటించడం లేదు. అలా అనుకుని ఉంటే ఆయన ఈ పాటికి తిరుపతిలో పోటీ చేస్తామని ప్రకటన చేసిఉండేవారు. అదే ఆయనను అలుసుగా తీసుకునేలా చేస్తోందని అంచనా వేస్తున్నారు. పవన్ జనాకర్షణను బేస్‌గా చేసుకుని ఎదిగిపోవాలని బీజేపీ ప్లాన్లు వేసకుంటోంది. కానీ ఆ జనాకర్షణను .. తమ బలంగా మల్చుకోవడంలో పవన్ కల్యాణ్ విఫలమవుతున్నారు. బీజేపీ విషయంలో ఆయన మరింత కఠినంగా ఉండాలని లేకపోతే.. జనసేన పార్టీ ఉనికి నామమాత్రం చేస్తారని జనసైనికులు మండిపడుతున్నారు.