తిరుపతి ఉపఎన్నికల్లో రాజకీయ పార్టీలే కాకుండా.. ఈ సారి దళిత వర్గాల తరపున ప్రత్యేకంగా అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జైభీం యాక్సిస్ జస్టిస్ పేరుతో దళితులపై దాడులు, ఏపీ సర్కార్ వైఖరిపై న్యాయపోరాటంతో ఒక్క సారిగా తెరపైకి వచ్చిన జడ శ్రవణ్ కుమార్ అనే న్యాయవాది నేతృత్వంలో ఇటీవల దళితుల్ని ఐక్యం చేసే పోరాటం ప్రారంభమయింది. ఏపీలో వరుసుగా దళితులపై దాడులు జరగడం .. ప్రభుత్వానికి చెందిన వారు.. అధికార పార్టీకి చెందిన వారు… ఈ వ్యవహారాల్లో ప్రధాన నిందితులుగా ఉండటంతో.. వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు.. జైభీం యాక్సిస్ జస్టిస్ సంస్థను జడ శ్రవణ్ కుమార్ ప్రారంభించారు.
మాజీ ఎంపీ హర్షకుమార్‌తో పాటు.. దళితుల్లో అనేక మంది ప్రముఖులు ఈ సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమ బలాన్ని నిరూపించడానికి స్వతంత్రంగా అయినా.. ఉమ్మడి అభ్యర్థిని నియమించాలని… దళితులందరూ కలసి నిర్ణయించుకున్నారు. తిరుపతిలో ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న దళిత నేతలు ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. తాము సంఘటితం అయ్యామని నిరూపించేలా.. ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అభ్యర్థిని కూడా ఖరారు చేసే ప్రక్రియ ప్రారంభించుకున్నారు. ప్రభుత్వంలో వేధింపులకు గురవుతున్న అనేక మంది దళితులే జైభీం యాక్సిస్ జస్టిస్ లో కీలకంగా ఉన్నారు.
ఇలాంటి వారిలో జడ్జి రామకృష్ణది కూడా కీలక పాత్ర. ఆయనపై ప్రభుత్వం సాగిస్తున్న వేధింపులు అన్నీ ఇన్నీ కావు. ఓ సారి ఆయన రోడ్డుపైకి రాకూడదన్న ఆదేశాలు కూడా అధికారులు ఇచ్చారు. తిరుపతిలో జైభీం యాక్సిస్ జస్టిస్ సమావేశానికి కొన్ని గంటల ముందే ఆయనను ఎప్పుడో ఆగస్టులో ఓ బ్యాంక్ అధికారి ఫిర్యాదు చేశారని అరెస్ట్ చేశారు. ఇలాంటి దమన కాండ సాగుతూండటంతో దళితుల్లో చర్చ ప్రారంభించాలని.. సంఘటిత అయితే తప్ప.. భవిష్యత్ లేదనే సంకేతాన్ని పంపాలని.. జైభీం యాక్సిస్ జస్టిస్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఆ దిశగా ముందడుగు వేస్తున్నారు.