ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ.. ముస్లిం- క్రిస్టియన్ వ్యతిరేకత పునాదుల మీద బలపడాలనే ప్రయోగం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఓ పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ క్యాప్‌లు పెట్టుకున్న పోలీసులు కేక్ కట్ చేసి పండగ చేసుకోవడం… ఓ పత్రికలో వచ్చింది. దాన్ని పట్టుకుని జీవీఎల్ నరసింహారావు మీడియా ముందుకు వచ్చేశారు. ఏపీలో ప్రభుత్వమే మత ప్రచారం చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. పోలీస్ స్టేషన్లలో క్రిస్మస్ పండుగ చేసుకోవాలని ప్రభుత్వమే ఆదేశించిందని.. దసరా.. దీపావళి జరుపుకోవాలని ఎందుకు ఆదేశించలేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తీరును సహించబోమన్నారు.
అదే ప్రెస్మీట్లో పాల్గొన్న మరో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ముస్లిం వివాదం ఎత్తుకున్నారు. మంత్రి వెల్లంపల్లి ఎప్పుడో.. ఎక్కడో… దర్గాలు నిర్మిస్తామని చెప్పారట. దేవాదాయ మంత్రి అయి ఉండి దర్గాలు నిర్మిస్తామని చెప్పడం ఏమిటని.. తక్షణం ఆయనను మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకరు క్రిస్టియన్.. మరొకరు ముస్లిం వ్యతిరేక ప్రకటనలు చేయడానికి ఉత్సాహం చూపడానికే కాదు… దానికి అర్థం వచ్చేలా జీవీఎల్.. ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని కూడా అన్నారు. తాము ప్రధాన ప్రత్యర్థిగా కాకూడదని.. టీడీపీనే ప్రత్యర్థిగా ఉండాలని వైసీపీ కోరుకుంటోందని జీవీఎల్ లాజిక్.
తెలంగాణలో.. సర్జికల్ స్ట్రైక్స్ వివాదం బాగా వర్కవుట్ కావడంతో ఆ డోస్ సరిపోదని.. రెండు సర్జికల్ స్టైక్స్ గురించి జీవీఎల్ మాట్లాడినట్లుగా ఉంది. ప్రభుత్వంపై పోరాడకుండా… మతాల గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసుకుంటే… బలపడిపోతామని.. బీజేపీ నేతలు భావిస్తున్నారు. దానికి తగ్గట్లే కార్యచారణ ప్రకటించుకుంటున్నారు. ఇతర మతాలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు.