దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించారు.. ఉచితంగా మంచి నీళ్లు వచ్చాయి… ఆస్తి పన్ను తగ్గింది.. పథకాల నిధులు వచ్చాయి… అలాగే గ్రేటర్ ఎన్నికల్లో ఓడించండి.. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తారు.. అంటూ గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌కు ముందు సోషల్ మీడియాలో పోస్టులు హైలెట్ అయ్యాయి. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వెనుకబడిపోవడంతో ఇప్పుడు అది నిజం అవుతోంది. తెలంగాణలో ఒకే సారి యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అన్ని శాఖల్లోని ఖాళీను సేకరించాలని.. నోటిఫికేషన్లకు ముహుర్తం ఖరారు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వతా ఒక్క సారి కూడా టీచర్ లను నియమించలేదు. ఇప్పుడు టీచర్లు… పోలీసు ఉద్యోగాలను పెద్ద ఎత్తున భర్తీ చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాలు అనే అంశం.. అత్యంత కీలకమైనది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే లక్ష ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ చెప్పేవారు. అయితే.. గెలిచిన తర్వాత పట్టించుకోలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు. అందుకే ఆయనకు యువ ఓటర్లు దూరమయ్యారన్న చర్చ ఉంది. ఇప్పుడు పరిస్థితిని సమూలంగా మార్చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. అందుకే యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని చేపడుతున్నారు.
అయితే.. ఇది ప్రకటనలకే పరిమితం అయితే యువతలో మరింత ఆగ్రహం వస్తుంది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు ఇచ్చి పోస్టులు భర్తీ చేస్తే.. కేసీఆర్‌పై యువతలో ఉన్న ఆగ్రహం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాజకీయంగా ప్రస్తుతం కేసీఆర్ ఎదురుగాలి ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయన మార్క్ నిర్ణయాలతో పరిస్థితిని సానుకూలంగా మార్చుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఉద్యోగాల భర్తీ నిర్ణయం మొదటదని అంచనా వేస్తున్నారు.