తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎంపిక విషయంలో రేస్ ఓ రేంజ్లో జరుగుతోంది. ఇంచార్జి మాణిగం ఠాగూర్ హైదరాబాద్ వచ్చి మూడు రోజుల పాటు పార్టీలోని అన్ని స్థాయిల నుంచి అభిప్రాయసేకరణ జరిపి ఢిల్లీకి వెళ్లారు. అయితే.. తమ వంతు ప్రయత్నాలను ఢిల్లీలోనే చేయాలని పలువురు సీనియర్లు ఢిల్లీ బాట పడుతున్నట్లుగా తెలుస్తోంది. మాణిగం ఠాగూర్ హైదరాబాద్‌లో ఉండగానే… పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డికే ఎక్కువ మంది సానుకూలంగా ఉన్నారన్న ప్రచారం గాంధీభవన్‌లో జరిగింది. అయితే రేసులో తాము ముందున్నామంటే.. తాము ముందన్నామని కోమటిరెడ్డి నుంచి జగ్గా రెడ్డి వరకూ అందరూ ప్రకటనలు చేస్తున్నారు.
కొంత మంది ఈ సారి బీసీ పీసీసీ చీఫ్‌ను నియమించాలని కొంత మంది కొత్త వాదన తెరపైకి తీసుకు వచ్చారు. పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ లాంటి వారి పేర్లను వెలుగులోకి తెస్తున్నారు. కొంత మంది నేతలకు కాంగ్రెస్‌లో కీలక స్థానాల్లో ఉన్న వారితో మంచి పరిచయాలు ఉండటంతో వారి ఆశీస్సుల కోసం ఢిల్లీ బాట పడుతున్నట్లుగా తెలుస్తోంది. పదవి కోసం కొంత మంది… పదవి వస్తుందనే వారికి తప్ప ఎవరికైనా ఇవ్వండి అనే వాదనతో మరికొంత మంది ఢిల్లీకి వెళ్లడం కాంగ్రెస్ రాజకీయాల్లో కామన్. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుని ఎంపిక విషయంలోనూ అదే జరుగుతోంది. రేవంత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఢిల్లీలోనూ లాబీయింగ్‌కు ప్రయత్నిస్తున్నారు. వీరందరి వెనుక ఓ కనిపించని శక్తి ఉందన్న అనుమానం కాంగ్రెస్‌లోనే ఉంది.
పీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి ముందు ఉన్నారని ప్రచారం జరుగుతూండటంతో.. పార్టీలో ముందు నుంచి ఉన్న వారికే అవకాశం కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని మైనస్ చేయాలని వారు అనుకుంటున్నారు. అయితే.. రేవంత్ రెడ్డి మాత్రం.. హైకమాండ్ తనను గుర్తిస్తుందని.. తను ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉన్నారు. ఢిల్లీ వెళ్లాలని కూడా అనుకోవడం లేదు. మరో వారంలో టీ పీసీసీకి కొత్త అధ్యక్షుడ్ని నియమించే అవకాశం ఉంది. అప్పటి వరకూ.. కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి..