దేశం మొత్తం అబ్బురపడేలా రెవిన్యూ సంస్కరణలు తెస్తున్నామని ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రకటించిన కేసీఆర్ మూడు నెలల కిందట… ఆస్తుల నమోదును నిలిపివేశారు. అప్పట్నుంచి ఇదిగో.. అదిగో అంటూ… కాలయాపన చేశారు. చివరికి ఎలాగోలా.. వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను ధరణి ద్వారా ప్రారంభించగలిగారు. కానీ.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభించే సరికి న్యాయపరమైన చిక్కులు వచ్చి పడ్డాయి. అసలు ధరణి వెబ్సైట్లో సమాచానికి ఎంత భద్రత ఉంది. చట్టబద్ధత ఉందన్నదానిపై పిటిషన్లు దాఖలు కావడంతో పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం.. ఆ సమాచారానికి పూర్తి స్థాయి భద్రత ఉందని.. చట్టబద్ధత ఉందని హైకోర్టు ముందు బలంగా వాదించలేకపోయింది. కౌంటర్లు దాఖలు చేయడానికి అదే పనిగా సమయం అడుగుతోంది. దీంతో రిజిస్ట్రేషన్లపై స్టే కొనసాగుతోంది.
చేస్తే.. ధరణిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని పట్టుదలకు పోయిన ప్రభుత్వానికి… చివరికి ప్రజల నుంచి వచ్చే ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. ఇంత కాలం.. రిజిస్ట్రేషన్లపై కోర్టు స్టే ఉందని చెప్పుకుంటూ వచ్చినా… పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు చేయడానికి ఎలాంటి స్టే లేదని కోర్టు స్పష్టం చేయడంతో రిజిస్ట్రేషన్లు ప్రారంభించక తప్పలేదు. కానీ కొత్త విధానంలోనూ ప్రజలకు తిప్పలే కనిపిస్తున్నాయి. ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయే సూచనలు కనిపించడంతో.. కేసీఆర్ ఉన్న పళంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరగాలని సూచిస్తూ.. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై..మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీని నియమించారు.
ఈ కమిటీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, ఇతర వర్గాల అభిప్రాయాలు తీసుకుంటుంది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను బాగా జరుగుతున్నాయని.. వ్యవసాయేతర భూముల విషయంలోనూ ఆ విధానమే రావాలని.. సులభంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానం రావాలని సీఎం కేసీఆర్ ఆ కమిటీకి సూచించారు. అంటే అటూ ఇటూ తిరిగి మళ్లీ ధరణి ద్వారానే రిజిస్ట్రేషన్లు చేస్తారన్నమాట. చట్టబద్ధత కోసం మంత్రుల కమిటీతో కొత్త ప్రయోగం చేస్తున్నారన్న చర్చ సహజంగానే జరుగుతోంది. ప్రణాళిక లేకుండా చేయడం వల్లేనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ప్రజలకు మూడు నెలల పాటు ఇబ్బందులు.. ప్రభుత్వానికి ఆదాయం కూడా నష్టమేనని నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ తాను అనుకుననది మాత్రమే చేస్తారు.