థియేటర్లు తెరచుకున్నా – కొత్త సినిమాల తాకిడి కనిపించడం లేదు. అందరి కళ్లూ.. సోలో బతుకే సో బెటరు సినిమాపైనే. థియేటర్ల రీ ఓపెన్ తరవాత.. వస్తున్న పెద్ద సినిమా ఇది. కాబట్టి – రిజల్ట్ ఎలా ఉంటుందో, జనాల ఆసక్తి ఎలా ఉందో తెలుసుకోవడానికి… ఇదే మంచి తరుణం.
అయితే.. సోలో బతుకే థియేటరికల్ రిలీజ్ అంత ఈజీ అయ్యేట్టు కనిపించడం లేదు. ఎందుకంటే… టాలీవుడ్ లో నిర్మాతలకూ, థియేటర్ యాజమాన్యానికీ.. మధ్య సయోధ్య కుదరడం లేదు. నిర్మాతల డిమాండ్లకు ఎగ్జిబీటర్లు ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా వీపీఎఫ్ ఛార్జీల వసూలుకు నిర్మాతలు ససేమీరా అంటున్నారు. ఆ ఛార్జీలను చెల్లించడానికి ఏ నిర్మాతా సిద్ధంగా లేడు. పైగా ప్రతీ టికెట్టుకీ నిర్వహణా రుసుముకింద రూ.2 నుంచి 5 రూపాయలు వరకూ వసూలు చేస్తుంటారు. ఆ సొమ్ము థియేటర్ యజమానికే. అయితే.. ఆ రుసుములో సగం వాటా నిర్మాతలకూ కావాలని పట్టుబడుతున్నారు. ఈ రెండు డిమాండ్లపై ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. వీటిపై ఇరు పక్షాలూ ఓ నిర్ణయానికి వస్తే తప్ప, థియేటర్లలో కొత్త సినిమాలు పడవు. అందుకే సోలో బతుకే థియేటర్లో విడుదల కావడం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. పాత రూల్స్‌కి ఓకే అంటేనే ఈ సినిమా థియేటర్లో చూడొచ్చు. లేదంటే ఓటీటీనే ఏకైక ఆప్షన్.
పైగా ప్రొడ్యూసర్ గిల్డ్ లో కీలకమైన సభ్యులు.. ఇప్పట్లో సినిమాల్ని విడుదల చేయకపోవడమే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు. సగం టికెట్లు అమ్ముకుని, థియేటర్లకు లీజులు చెల్లించుకుని, వీపీఎఫ్‌లు కట్టుకోవడం చాలా కష్టమన్నది వాళ్ల ఉద్దేశం. అందుకే.. ఎగ్జిబీటర్లు తమ డిమాండ్లకు ఒప్పుకునేంత వరకూ సినిమాల్ని విడదుల చేయకూడదన్న పట్టుదలతో ఉన్నారు. మరోవైపు ఎగ్జిబీటర్ల వాదన వేరేలా ఉంది. కరోనా వల్ల ఇప్పటికే తాము చాలా నష్టపోయామని, సినిమాలు లేకపోయినా కరెంటు బిల్లు, ఉద్యోగస్థుల వేతనాలు చెల్లించుకుంటూ వచ్చామని, ఇప్పుడు వీపీఎఫ్ ఛార్జీలు ఆపేస్తే మరింత నష్టపోతామని అంటున్నారు. మెయింటెనెస్ ఛార్జీల్లో నిర్మాతలకు వాటా ఎలా ఇస్తామని? థియేటర్ నిర్వహణకు ఆ రుసుము ఏమాత్రం సరిపోదని వాదిస్తున్నారు.