సమానత్వం, సౌభ్రాతృత్వం అనే కోరిక, లక్ష్యంతో పుట్టింది నక్సలిజం. దోపిడీ దారులకు ఎదురొడ్డి నిలిచి, పేదల పక్షం మాట్లాడింది. ఓ దశలో నక్సలైట్ల ఉద్యమం ఉధృతంగా నిలిచింది. ఓ ప్రశ్నగా వెలిగింది. అలాంటి రోజుల్లో పుట్టిన ఓ కామ్రేడ్ కథ.. విరాటపర్వం. రానా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. వేణు ఉడుగుల దర్శకుడు. రానా పుట్టిన రోజు సందర్భంగా ఓ చిన్న టీజర్‌ని విడుదల చేశారు.
కామ్రేడ్ రవి అన్న పాత్రలో రానాని పరిచయం చేస్తూ సాగిన టీజర్ ఇది. 1990 లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలకు తెరరూపం ఇచ్చామని చిత్రబృందం టీజర్లో స్పష్టం చేసింది.
ఈ దేశం ముందు ఓ ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది
సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది…
డాక్టర్ రవిశంకర్ అలియాస్ రవి అన్న… అంటూ రానా పాత్రని పరిచయం చేస్తూ ఈ టీజర్ ని కట్ చేశారు.
ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం – దోపిడీ రాజ్యం అంటూ కొన్ని నినాదాలు వినిపించాయి. దాన్ని బట్టి ఈ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ఓ ఉద్యమం గురించి ఈ కథలో ప్రస్తావించబోతున్నారన్న విషయం స్సష్టంగా అర్థం అవుతోంది. ఇందులో నక్సలిజమే కాదు. ఓ అందమైన ప్రేమకథ కూడా ఉండబోతోంది. మరి ఈ రెండింటినీ ఎలా మిక్స్ చేశారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.