భారతీయ జనతా పార్టీకి అధికారం అప్పగిస్తే రూ. ఐదు వేల కోట్లతో అమరావతిని పూర్తి చేసి చూపిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. తాము జగన్మోహన్ రెడ్డిలా మాట తప్పం.. మడమ తిప్పమని కూడా ఆయన హామీ ఇస్తున్నారు. అమరావతి ఉద్యమం ప్రారంభమై ఏడాది అవుతున్న సందర్భంగా … ఇప్పుడు సాధారణ ప్రజలతో పాటు.. రాజకీయ పక్షాల్లోనూ అమరావతిపై మళ్లీ చర్చ ప్రారంభమయింది. ఈ సందర్భంగా.. బీజేపీ అమరావతి విషయంలో డబుల్ గేమ్ ఆడుతోందని విమర్శలు వస్తున్న సమయంలో సోము వీర్రాజు.. మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించేశారు. అమరావతి రాజధానిగా ఉండాలనేది బీజేపీ విధానమని తేల్చేశారు.
అంతే కాదు.. నరేంద్రమోడీ కూడా.. అమరావతి వైపు ఉన్నారని ఆయన అంటున్నారు. అలా ఎందుకు అనుకోవాలో.. ఓ ఉదాహరణ కూడా చెప్పారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత ప్రతీ రాష్ట్ర రాజధానిలో ఎయిమ్స్ ఉండాలన్న కేంద్ర విధానంలో భాగంగా అమరావతికి ఎయిమ్స్ కేటాయించారు. రూ. 1800 కోట్లతో ఎయిమ్స్‌ను నిర్మించాలనుకున్నారు. ఇప్పటి వరకూ దాదాపుగా నాలుగు వందల కోట్ల వరకూ ఖర్చు పెట్టి నిర్మాణాలు చేశారు. అమరావతిలో ఇతర ప్రాజెక్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపేసినా కేంద్రం మాత్రం ఎయిమ్స్ నిర్మాణాన్ని కొనసాగిస్తోంది. ఇదే అంశాన్ని సోము వీర్రాజు మోడీ చిత్తశుద్ధికి సాక్ష్యంగా చూపిస్తున్నారు. మోదీ అమరావతి వైపు ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని ఆయన అంటున్నారు. సీఎం వెంటనే అమరావతి రైతులతో చర్చించి సమస్యను పరిష్కరిచాలని సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు.
అయితే.. నిజంగా మోడీ అమరావతి వైపు ఉంటే… జగన్మోహన్ రడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పుడు జాతీయ స్థాయిలో వచ్చిన వ్యతిరేకతను… దేశ ఆర్థిక ప్రయోజనాలను జగన్ దెబ్బకొడుతున్నారని ఆర్థిక నిపుణుల నుంచి హెచ్చరికలు వచ్చినప్పుడే స్పందించే వారని కొంత మంది అంటున్నారు. జగన్ నిర్ణయాలను కేంద్రం మద్దతు ఉండటం వల్లే ఇంత ధైర్యంగా మందడుగు వేస్తున్నారని అంటున్నారు. ఏది నిజమో కానీ… బీజేపీ మాత్రం మెల్లగా అమరావతికి మద్దతుగా వాయిస్ పెంచుకుంటూ పోతోంది.