ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన హఠాత్తుగా ఖరారైంది. ఆయన మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు అమిత్ షాతో సమావేశం అవుతారు . ఈ మేరకు ఏపీ ప్రభుత్వ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ అంశంపై అమిత్ షా తో భేటీకి వెళ్తున్నారో స్పష్టత లేదు. కొద్ది రోజుల కిందట.. ఆయన అమిత్ షాతో రెండు సార్లు సమావేశమయ్యారు. ప్రధానితోనూ భేటీ అయ్యారు. అప్పట్లోఏ అంశాలపై మాట్లాడారో అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. కానీ ప్రధానితో భేటీ అయిన తర్వాత.. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ.. లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేయడం కలకలం రేపింది.
ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాలని కానీ.. అగ్రనేతలతో భేటీ అవ్వాలని ప్రయత్నిస్తున్నారన్న సమాచారం కానీ బయటకు రాలేదు. అయితే.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేయడానికి పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారన్న ప్రచారం మాత్రం కొంత కాలంగా సాగుతోంది. సీపీఐ నారాయణ కూడా అదే మాట అంటున్నారు. ఈ సందర్భంలో అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు కావడం.. రాజాకీయవర్గాలను సైతం ఆసక్తి రేకెత్తిస్తోంది. న్యాయవ్యవస్థ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దాడి విషయంలో ప్రస్తుతం అంతా నిశ్మబ్ద వాతావరణం ఉంది. ఈ విషయంలో… జగన్మోహన్ రెడ్డిపై కోర్టు ధిక్కరణ పిటిషన్లు మూడు దాఖలైతే రెండింటిని సుప్రీంకోర్టు కొట్టి వేసింది కూడా.
కేంద్ర అటార్నీ జనరల్.. జగన్ పై కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు. ఈ పరిణామాలన్నింటితో జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఏ అంశంపై జగన్ అమిత్ షాతో చర్చిస్తారన్నదానిపై క్లారిటీ లేదు. భేటీ అయిన తర్వాత కూడా ప్రకటించే చాన్స్ లేదు. జగన్ అధికారిక మీడియాలో ప్రకటించే విధంగా.. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారని చెప్పుకోవాల్సిందే.