తెలుగు రాష్ట్రాల చీఫ్ జస్టిస్లను బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని… ఏ క్షణమైనా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందన్న ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది. మామూలుగా అయితే.. న్యాయమూర్తుల బదిలీ సాధారణ అంశమే. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగానే చర్చనీయాంశం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొంత కాలంగా… ప్రధాన న్యాయమూర్తుల బదిలీకి లాబీయింగ్ జరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది. సీపీఐ నేత నారాయణ లాంటి వాళ్లు రెండు రోజుల కిందటే… ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అది కుట్రో కాదో కానీ… బదిలీ మాత్రం నిజం అవుతోందన్న సమాచారం బయకు వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో హైకోర్టులు ఇస్తున్న తీర్పులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మింగుడు పడటం లేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విషయంలో అక్కడి ప్రభుత్వం ఎంత అసహనంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హైకోర్టుపై, న్యాయవ్యవస్థపై ప్రత్యేకంగా సోషల్ మీడియాతో ఎటాక్ చేశారు. అధికార పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. చివరికి ఫోన్ ట్యాపింగ్ చేయించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. హైకోర్టు న్యాయమూర్తుల మీద పిటిషన్లు వేయించారు. మాజీ జడ్జి రామకృష్ణతో ఆరోపణలు చేయించాలన్న ప్రణాళిక కూడా వేశారన్న పిటిషన్లు కూడా కోర్టుల్లో పడ్డాయి. తెలంగాణ హైకోర్టులోనూ… ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక తీర్పులు వచ్చాయి. కరోనా కట్టడి చర్యల దగ్గర్నుంచి ధరణి రిజిస్ట్రేషన్ల వరకూ… అనేక అంశాలపై హైకోర్టు న్యాయపరమైన అంశాలపై ఇబ్బందులు ఎదురయ్యాయి.
హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎవరు ఉన్నా… చట్టం, రాజ్యాంగం ప్రకారమే తీర్పులు చెబుతారు. న్యాయవ్యవస్థ పనితీరు ఎవరు ఉన్న ఒకలాగానే ఉంటుంది. న్యాయమూర్తుల బదిలీలు న్యాయప్రక్రియ మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉండదు. న్యాయవ్యవస్థ వ్యక్తుల మీద నడవదని లాయర్లు గుర్తు చేస్తున్నారు. న్యాయమూర్తి హోదాలో ఉన్నవారు.. తమ శక్తి మేర బాధితులకు.. న్యాయం కోసం వచ్చిన వారికి న్యాయం చేయడానికే ప్రయత్నిస్తారని అంటున్నారు. న్యాయమూర్తుల బదిలీ జరిగినా… అది సాధారణ ప్రక్రియలో భాగమే అవుతుందని చెబుతున్నారు.