ఆర్థికకష్టాలు వచ్చినా సరే … ప్రజలు తన మీద పెట్టుకున్న పథకాల అమలు నమ్మకాన్ని కోల్పోకూడదన్న పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారు. అమ్మఒడి పథకాన్ని వచ్చే ఏడాది జనవరి తొమ్మిదో తేదీన అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం దాదాపుగా రూ. ఏడు వేల కోట్లను.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును కూడా పూర్తి చేశారు. ఇప్పటికే పాఠశాలల్లో అర్హులైన విద్యార్థుల తల్లులు, సంరక్షకుల పేర్లు నమోదు ప్రక్రియ చేపట్టారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకం కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు వర్తింపజేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. గత ఏడాది ప్రైవేటు స్కూళ్ల విద్యార్థుల తల్లులకూ ఇచ్చారు. ఈ సారి ప్రత్యేకంగా ప్రైవేటు ప్రస్తావన తేకపోయినా.. అందరికీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 16వ తేదీన అర్హులైన లబ్ధిదారుల జాబితాలను అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఎవరి పేర్లైనా లేకపోతే.. వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. సోషల్ ఆడిట్ కూడా ఈ నెలలోనే పూర్తి చేశారు. నెలాఖరు కల్లా.. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది.
గత ఏడాది 43 లక్షల యాభై వేల మందికి సాయం చేసినట్లుగా ప్రభుత్వం తెలిపింది. దాదాపుగా ఆరున్నర వేల కోట్లు పంపిణీ చేశారు. ఈ సారి మరింత ఎక్కువగా రూ. ఏడు వేల కోట్ల వరకూ పంపిణీ చేయాల్సి ఉంటుంది. నిజానికి అమ్మఒడి పథకంపై ఫిర్యాదుల కోసం..ఏదైనా గ్రీవెన్స్ పెడితే వేలాది గా తల్లులు తరలి వస్తున్నారు. తమకు నగదు అందలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ సారి అలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.