టీఆర్ఎస్ నేతలకు ప్రజలపై కోపం వస్తోంది. తాము ఎంతో చేశామని కానీ వారు గుర్తించడం లేదని ఫీలవుతున్నారు. ఎంతో చేశాం కాబట్టి.. ఆ “ఎంతో” ఆపేస్తే ప్రజలకు తాము చేసిందేమిటో తెలిసి వస్తుందని అనుకుంటున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఇదే మాట చెబుతున్నారు. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటు ఉందని.. అందుకే మంచి చేయకూడదని ఆయన అంటున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎంను కోరాలని ఉందని.. ఆయన చెప్పుకొచ్చారు. 24 గంటల కరెంట్ కాకుండా.. కేవలం 3 గంటల కరెంట్ ఇవ్వాలని కోరుతానని.. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిలిపివేసి.. ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
లక్ష్మారెడ్డి సగటు అధికార పార్టీ నాయకుడిగానే ఆలోచించారు. అధికారంలో ఉన్న వారు ఎవరైనా.. సంక్షేమ పథకాలకు సొంత డబ్బులు ఇవ్వరు. ప్రజల సొమ్మునే ఇస్తారు. ప్రజలు అధికారం ఇచ్చేది.. తమకు ఉచితంగా డబ్బులు ఇస్తారని కాదు.. బతుకులు బాగు చేస్తారని. కానీ ప్రజల బలహీనతలతో రాజకీయం చేసే రాజకీయ నేతలు.. ప్రజలకు ఉచితాలు ఇచ్చి.. తామేదో గొప్ప సాయం చేశామని.. వారికి చేయకుండా ఉంటే బాగుండేదని అనుకుంటారు. లక్ష్మారెడ్డి కూడా అలాంటి రాజకీయ నేతనే.
ప్రజలకు ఎంత ఉచితాలు ఇచ్చినా కొన్నాళ్లకు అవి పాతబడిపోతాయి. సమస్యలు ముందుకు వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది. దీన్ని లక్ష్మారెడ్డి గుర్తించలేక.. ఇరవై నాలుగు గంటల కరెంట్.. సంక్షేమ పథకాలు అంటూ… ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్మారెడ్డి తీరు అసహనం పెరిగిపోతున్న టీఆర్ఎస్ నేతల వైఖరిని బయట పెడుతోంది. ముందు ముందు మరింత మంది టీఆర్ఎస్ నేతలు ఇలాంటి విచిత్ర వాదనలతోనే తెర మీదుక వచ్చే అవకాశం ఉంది.