పంచాయతీ ఎన్నికలను ఆపడానికి ఏపీ సర్కార్ ఏ చిన్న అవకాశం దొరికినా వదిలి పెట్టడం లేదు. నిన్నటిదాకా కరోనా సెకండ్ వేవ్.. నిపుణుల నివేదికలు అంటూ చెబుతూ వచ్చిన ప్రభుత్వం తాజాగా… రేసులోకి వ్యాక్సిన్ తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం కరోనా వ్యాక్సిన్ సిద్ధం చేస్తోందని.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కరోనా వాక్సినేషన్ కోసం.. పోలీసులు, అన్ని శాఖల సిబ్బంది అవసరమని ఆ అఫిడవిట్లో తెలిపింది. మొదటి డోస్ వేసిన 4 వారాల తర్వాత.. రెండో డోస్ వేయాలని కేంద్రం సూచించిందని.. ఎన్నికల ప్రక్రియలాగానే వాక్సినేషన్ నిర్వహించాల్సి ఉంది కాబట్టి.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని.. అడిషనల్ అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
వ్యాక్సిన్ కారణాన్ని ప్రభుత్వం చెప్పడంతో.. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని ఎస్ఈసీ తరపు న్యాయవాది కోర్టును కోరారు. తదుపరి విచారణ వచ్చే శుక్రవారం జరుగుతుంది. ఎస్ఈసీ రమేష్ కుమార్ ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయన విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం రాజ్యాంగ వ్యతిరేక చర్య కావడంతో ప్రభుత్వం .. ఎలాగైనా కోర్టు ద్వారా.. ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. వరుసగా ఏదో ఓ కారణం చెబుతూనే ఉంది.
ఉద్యోగ సంఘాలతోనూ హైకోర్టులో పిటిషన్లు వేయిస్తామన్న సంకేతాలు కూడా పంపింది. చివరికి ఇప్పుడు.. వ్యాక్సిన్ కారణంగా చూపిస్తోంది. వాస్తవానికి ఇండియాలో వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో క్లారిటీ లేదు. ఏ ఒక్క వ్యాక్సిన్‌కు కేంద్రం ఇంత వరకూ అనుమతి ఇవ్వలేదు. అందుబాటులోకి వచ్చిన తర్వాతే పంపిణీ ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అయినా ప్రభుత్వం వ్యాక్సిన్ వేయాలనే కారణం చెబుతోంది. ఇది న్యాయనిపుణుల్లో సైతం చర్చనీయాంశం అవుతోంది.