బీజేపీ పై హైద్రాబాద్ నుంచే యుద్ధం మొదలవుతుంది. ఆ పోరాటానికి తానే నాయకత్వం వహిస్తానని… డిసెంబర్ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులతో హైద్రాబాద్ లో సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పుడు డిసెంబర్ రెండో వారం కూడా అయిపోయింది. కానీ కేసీఅర్ యుద్ధం ప్రారంభించలేదు. సైలెంట్‌గా ఫామ్‌హౌస్‌కు పరిమితం అయ్యారు. రైతుల ఆందోళనలపైనా ఇప్పుడు మాట్లాడటం లేదు.
కత్తి దూయకుండా పూలు చల్లుతున్నారా.. ?
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ కూటమిని కట్టాలని నిర్ణయించిన కేసీఆర్.. మమత బెనర్జీ, స్టాలిన్, నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్ వంటి నేతలంతా టచ్ లో ఉన్నారని కేసీఆర్ ప్రకటించారు. జిహెచ్ఎంసి ఎన్నికల ముంగిట తెలంగాణ భవన్ లో జరిగిన టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం లో కేసీఆర్ ఇక యుద్ధమే అన్న వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ లో రెండు వారాలు పూర్తయ్యాయి. కానీ టిఆర్ఎస్ చీఫ్ చెప్పినట్లు సమరానికి అడుగులు పడటం లేదు. గర్జించిన కేసీఆర్ గప్ చుప్ అయ్యారు. గ్రేటర్ ఫలితాల తర్వాత పరుగున ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన ఆయన అటునుంచి ఆటే ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. దాంతో కేసీఆర్ చెప్పిన బీజేపీ వ్యతిరేక అఖిలపక్ష నేతల సదస్సు సందిగ్ధంలో పడింది. కేసీఆర్ వైఖరి చూస్తే ఇక ఆ ప్రకటన అటకెక్కినట్లే .
బద్మాష్ బీజేపీ మంచి పార్టీ అయిపోయిందా..?
కేంద్రంలో ఉన్నది ఒకప్పటి బీజేపీ కాదని బాగా తెలిసిన కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతల ముందు సాగిల పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టిఆర్ఎస్ మధ్య మాటలు హద్దులు దాటాయి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్న బీజేపీ మీద కేసీఆర్ ఏకంగా యుద్ధమే ప్రకటించారు. దాంతో బీజేపీ కేంద్ర పెద్దలు కేసీఆర్ మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన ఆయన సమర సన్నాహాలు వీడి సయోధ్య కోసం శ్రమిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే కేసులకు భయపడే కేసీఆర్ పొర్లు దండాలు పెడుతున్నారనే విమర్శలు వస్తున్నా.. వెనక్కి తగ్గడం లేదు.
కేసులకు భయపడుతున్నారని జనం నమ్ముతారు సారూ..!
బలపడేందుకు దూకుడుమీదున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం వెనక్కి తగ్గడం లేదు. హస్తిన వెళ్లొచ్చిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పీడ్ కంటిన్యూ చేస్తున్నారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లొచ్చినా కేసుల నుంచి తప్పించుకోలేరని, జైల్ కు వెళ్లడం ఖాయమని తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం సైలెంట్ అయ్యారు. అసలే బీజేపీ స్పీడ్ మీదుంది. టిఆర్ఎస్ నేతలకు గాలం వేసే పనిలో పడింది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన ద్వారా తాము బీజేపీ కి సన్నిహితులమనే సంకేతాలు పంపించినట్లయింది. కానీ బీజేపీకి కేసీఆర్ భయపడుతున్నారనే తప్పుడు సంకేతాలు కొంత మంది నేతలు ఆవేదన చెందుతున్నారు. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని విశ్లేషిస్తున్నారు.