వైసీపీలో వర్గ పోరు రోడ్డున పడుతోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా చీరాల, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. చీరాలలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెండు గ్రామాల్లోని మత్స్యకారుల మధ్య ఏర్పడిన గొడవ .. ఊళ్లపై దాడులకు దారి తీసింది. అయితే ఈ గొడవల వెనుక ఆమంచి కృష్ణమోహన్ ఉన్నాడని మత్స్యకారులు నమ్ముతున్నారు. గ్రామస్తులతో చర్చలకు ఎంపీ మోపిదేవిని వైసీపీ హైకమాండ్ పంపింది. ఆయన వెంట వెళ్లిన ఆమంచిని మత్స్యకారులు తరిమికొట్టారు. ప్రాణభయంతో పరుగులు తీస్తున్న ఆమంచి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన జరిగిన వెంటనే… చీరాల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీలో కరణం వెంకటేష్, సీఎం జగన్ ఫోటోలు మాత్రమే పెట్టి.. స్వేచ్ఛ- శాంతి అంటూ పెద్ద అక్షరాలతో ప్రింట్ చేయించారు. గత ప్రజాప్రతినిధుల వికృత చేష్టలతో చీరాల పారిశ్రామికంగా వెనుకబడిందని అందులో రాశారు. ఆమంచి వల్లే గొడవలు అవుతున్నాయని.. ఆయనను దూరం పెట్టాలన్నట్లుగా ఆ ఫ్లెక్సీలు ఉన్నాయి. కొద్ది రోజులుగా ఆమంచికి వైసీపీ హైకమాండ్ పెద్దల అపాయింట్మెంట్లు కూడాదొరకడంలేదు. కొత్తగా పార్టీలో చేరిన కరణంకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కారణంగా ఆమంచి .. తన పట్టును చూపించుకునేందుకు నియోజకవర్గంలో అలజడి రేపుతున్నారన్న అనుమానాలు వైసీపీలో ప్రారంభమయ్యాయి. ఆమంచి అనుచరులు ..కరణం వర్గీయులపై దాడులకు పురికొల్పుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
మరో వైపు గన్నవరం నియోజకవర్గంలోనూ పరిస్థితి అలాగే ఉంది. అక్కడ టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వంశీ పనులు, పదవులు అన్నీ తన అనుచరులకే కేటాయిస్తూండటంతో … ఎప్పటి నుంచో ఉన్న వైసీపీ నేతలు ఆత్మహత్యాయత్నాలకు కూడా పాల్పడుతున్నారు. ఎస్సీ సెల్ నేత గా ఉన్న జోజి బాబు అనే వ్యక్తి తనకు పనులు దక్కకుండా వంశీ చేస్తున్నారని బిల్లులు మంజూరు చేయకుండా.. అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని చచ్చిపోతానని ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. గన్నవరం పంచాయతీని గతంలో జగన్ తీర్చేశారు. కానీ అది ఆ క్షణానికే పరిమితం అయింది.