ప్రపంచం మొత్తానికి 2020 ఓ పీడకల. చైనా నుంచి ఊడిపడ్డ కరోనా… ప్రపంచ దేశాల్ని అల్లాడించేసింది. ప్రతీ వ్యవస్థపైనా దారుణంగా దెబ్బ కొట్టింది. సినిమా రంగం కూడా చిన్నాభిన్నమైంది. సినిమాలు ఆగిపోయాయి. షూటింగులకు పేకప్ చెప్పేశారు. రిలీజ్ లు లేవు. థియేటర్లకు తాళాలు పడ్డాయి. అవి తెరచుకునే మార్గం శూన్యమైపోయింది. సినిమాకి సంబంధించినంత వరకూ 2020 బ్లాక్ ఇయర్.
ప్రతీ యేటా తెలుగు నుంచి కనీసం 150 నుంచి 180 సినిమాలు విడుదల అవ్వడం సహజంగా జరిగే విషయం. అయితే ఈసారి ఆ అంకె 30 నుంచి 50 లోపే. అది కూడా ఓటీటీల పుణ్యం. అంటే దాదాపు 150 సినిమాలకు సంబంధించిన రొటేషన్ ఆగిపోయింది. షూటింగ్ ఆగిపోవడం, సినిమా రిలీజ్ వాయిదా పడడం అంటే చిన్న విషయం కాదు. అప్పటికే ఆ సినిమాపై ఎంతో కొంత ఖర్చు చేసి ఉంటారు. ఎక్కడి నుంచో డబ్బు వడ్డీకి తెచ్చి ఉంటారు. షూటింగ్ ఆగిపోవడం వల్ల, విడుదల వాయిదా వేయడం వల్ల ఆ అప్పు తీర్చడం కుదరదు. వడ్డీలు, చక్రవడ్డీలై, చక్రవడ్డీలు బారు వడ్డీలై నిర్మాతల నడ్డి విరిచేస్తుంటాయి. కొన్ని వందల కోట్ల రూపాయలకు నిర్మాతలు వడ్డీలు కడుతూ.. ఆస్తుల్ని గుల్ల చేసుకుంటున్నారిప్పుడు. ఇంతకంటే దురదృష్టం ఏముంది?
కరోనా వల్ల… మార్చిలో థియేటర్లను మూసేశారు. ఆ తరవాత లాక్ డౌన్. షూటింగులు ఆగిపోయాయి. వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలు బేల చూపులు చూశాయి. దసరా, దీపావళి పండగలు బోసిగా వెళ్లిపోయాయి. సుదీర్ఘ విరామం తరవాత… థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు వచ్చినా, 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాల్ని విడుదల చేసుకొనే ధైర్యం ఎవరూ చేయడం లేదు. పైగా… నిర్మాతలకూ, థియేటర్ యజమానులకూ సయోధ్య కుదరడం లేదు. ఇప్పుడు క్రిస్మస్కి సైతం.. థియేటర్లు తెరచుకోని పరిస్థితి. సంక్రాంతి సినిమాలు సైతం, వేసవికి షిఫ్ట్ అయిపోయే ప్రమాదం ఏర్పడింది.
మార్చి నుంచి డిసెంబరు వరకూ సినీ ప్రేక్షకులకు, నిర్మాతలకు కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏదైనా ఉందీ అంటే… అది ఓటీటీనే. అమేజాన్, నెట్ఫ్లిక్స్, జీ 5, ఆహా లాంటి ఓటీటీలు ఉండబట్టే, కొత్త సినిమాలు కొన్నయినా చూసే అవకాశం దక్కింది ప్రేక్షకులకు. `వి`, `నిశ్శబ్దం`, `ఆకాశమే నీ హద్దురా` లాంటి పెద్ద సినిమాల్ని సైతం ఓటీటీలో చూసుకున్నారు. అందులో ఎన్ని హిట్టయ్యాయి? ఎన్ని ఫట్టుమన్నాయి? అనేది పక్కన పెడితే… థియేటర్లు లేని రోజుల్లో, ఇల్లే థియేటర్ గా మార్చుకుని, కాస్త వినోదాన్ని పొందే అవకాశాన్ని మాత్రం ఓటీటీలు కల్పించాయి.
థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో చెప్పలేని పరిస్థితుల్లో నిర్మాతలు చాలా కష్టనష్టాలు అనుభవించారు. పెరుగుతున్న వడ్డీలు వాళ్లని మరింత క్షోభ పెట్టాయి. ఇలాంటి సమయంలో వచ్చిన రేటుకి.. ఓటీటీలకు అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. ఓటీటీలూ నిర్మాతల కష్టాన్ని తక్కువ చేయలేదు. మంచి రేట్లకే సినిమాల్ని కొన్నాయి. కొన్ని సినిమాలు కొని ఓటీటీలు నష్టపోయాయి గానీ, ఓటీటీల వల్ల నిర్మాతలు నష్టపోయిన దాఖలాలు తక్కువే అని చెప్పాలి. ఈ లాక్ డౌన్ సమయంలో ఓటీటీ ప్రాధాన్యత చిత్రసీమకు అర్థమైంది. అందుకే కొత్త ఓటీటీలు, ఏటీటీలూ ప్రారంభమయ్యాయి. పెద్ద పెద్ద స్టార్లు ఓటీటీ వైపు అడుగులు వేయడం మొదలెట్టారు. కేవలం ఓటీటీల కోసమే సినిమాలు తీయడానికి నిర్మాతలూ రెడీ అయ్యారు. భవిష్యత్తులో థియేటర్లు తెరచుకొని, 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఇచ్చినా – ఓటీటీలు తమ ప్రభావిన్ని చూపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఓటీటీలో సినిమా చూడ్డానికి ప్రేక్షకుడు అలవాటు పడుతున్నాడు. థియేటర్లకు వెళ్లి, వందలూ వేలూ తగలేసుకోవడం కంటే, ఓటీటీలో సినిమాలు చూడడం మేలు అని ప్రేక్షకులూ ఓ నిశ్చితమైన అభిప్రాయానికి వస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలలో చాలా థియేటర్లు ఇప్పుడు క్రమక్రమంగా మూతబడుతున్నాయి. ఈ యేడాది ఇప్పటి వరకూ 30 థియేటర్లు గొడౌన్లుగా మారాయి. రానున్న రోజుల్లో మరో 200 థియేటర్లు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది.