సీనియర్ నటుడు అలీ.. ఇప్పుడు నిర్మాతగా మారారు. `అందరూ బాగుండాలి – అందులో నేనుండాలి` సినిమాతో ఆయన నిర్మాతగా తొలి అడుగు వేస్తున్నారు. బుధవారమే ఈ సినిమా పట్టాలెక్కింది. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న `వికృతి` కి ఇది రీమేక్. `వికృతి` కథ మొత్తం మెట్రో రైలులో సాగుతుంది. కేరళలో `వికృతి` షూటింగ్ జరుగుతున్నప్పుడు చిన్న సినిమాల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం మెట్రో సర్వీసుని ఉపయోగించుకున్నందుకు ఎలాంటి ఫీజూ వసూలు చేయలేదు. అలీ కూడా ఇలాంటి సహకారాన్నే ఇక్కడి ప్రభుత్వం నుంచి కూడా ఆశిస్తున్నాడు. క్లాప్ కొట్టడానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వచ్చారు. అలీతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. మంత్రి తలచుకుంటే.. అలీకి మెట్రో ఫ్రీగా రావొచ్చు. మెట్రో రైలు వాడుకుంటే రోజుకి 5 నుంచి 7 లక్షల వరకూ రుసుము వసూలు చేస్తారు. లొకేషన్ ఛార్జ్ రూపంలో. కనీసం 20 రోజులైనా షూటింగ్ మెట్రోలోనే చేయాలి. ఆ లెక్కన కనీసం కోటి రూపాయలైనా ఆదా చేయొచ్చు. కనీసం సగం రిబేట్ ఇచ్చినా 50 లక్షలు మిగిలినట్టే. మరి అలీకి ఈ ఆఫర్ ఇస్తారో, లేదో చూడాలి.