రెండు పులులు తలబడితేనే మజా. ఇద్దరు స్టార్లు.. నువ్వా? నేనా? అంటూ వెండి తెరపై కొట్టుకోవడమే – మ్యాజిక్. అలాంటి మ్యాజిక్ `మాస్టర్`లో రిపీట్ కానుంది. విజయ్, విజయ్‌సేతుపతి నాయక ప్రతినాయకులుగా నటిస్తున్న సినిమా ఇది. ఇద్దరు స్టార్లు వెండి తెరపై విరోధులుగా మారడం – మంచి కమర్షియల్ అంశం. `ఖైది`తో ఒక్కసారిగా అందరినీ ఆకట్టుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. తెలుగులో టీజర్ విడుదలైంది. తమిళ టీజర్‌నే డబ్ చేశారు. కొత్త షాట్లేం లేవు. కాకపోతే.. టీజర్ కట్ చేసిన విధానం మాస్ కి బాగా నచ్చేస్తుంది. ఓ రౌడీ లాంటి ప్రొఫెసర్. ఎదురుగా.. ఓ సింహం లాంటి విలన్. ఇద్దరూ ఢీ కొట్టుకుంటే ఏమిటన్నది కథ. తెలుగులో చిరంజీవి చేసిన `మాస్టర్` కూడా ఇలాంటి కథే. కాకపోతే లోకేష్ ఈ కథ ఓ కొత్త స్థాయిలో ఆవిష్కరించాడన్న నమ్మకం కలుగుతోంది. అనిరుథ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజయ్ స్టైల్.. చివర్లో ఇద్దరు విజయ్లూ.. పిడికిలి యుద్ధం మొదలెట్టడం – ఇవన్నీ పక్కగా కుదిరాయి. తుపాకి తరవాత తెలుగులో విజయ్ కి కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక్కడ విజయ్ సేతుపతి కూడా పాపులర్ అవుతున్నాడు. కాబట్టి.. ఓ తెలుగు సినిమా విడుదలైతే ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో, ఈ డబ్బింగ్ బొమ్మపై కూడా అంతగానే దృష్టి పెట్టే ఛాన్సుంది.