వ్యాక్సిన్ వేయాలి ..ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు వద్దంటూ ప్రభుత్వం చేస్తున్న వాదనను ఎస్‌ఈసీ కొట్టి పడేసింది. అసలు వ్యాక్సినే ఇంత వరకూ రాలేదని.. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రోజుల క్రితం.. వ్యాక్సిన్ కారణంతో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్న ప్రభుత్వ అఫిడవిట్‌పై… ఎస్‌ఈసీ తాజాగా కౌంటర్ దాఖలు చేశారు. కరోనా వ్యాక్సిన్ రావడానికి 3 నుంచి 6 నెలల సమయం పడుతుందని… ఇప్పటికిప్పుడు ఆ వ్యాక్సిన్ రావడంలేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఒక వేళ వచ్చినా వ్యాక్సిన్‌ను ప్రాధాన్యతాక్రమంలో పంపిణీ చేస్తున్నారని.. వ్యాక్సిన్ పంపిణీకి స్థానిక ఎన్నికలు అడ్డు కావని స్పష్టం చేసింది.
అదే సమయంలో ఇప్పటికే బిహార్, రాజస్థాన్, హైదరాబాద్‌లో.. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారని గుర్తు చేసింది. ఏపీలో ఎన్నికల నిర్వహణకు సానుకూల వాతావరణం ఉందని.. అందరిని సంప్రదించిన తర్వాతే.. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామని స్పష్టం చేసింది. ఎన్నికలు వాయిదా వేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేయాలని.. తగిన ఆదేశాలివ్వాలని అఫిడవిట్‌లో ఏపీ ఎస్ఈసీ అభ్యర్థించింది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ సర్కార్ – ఎస్‌ఈసీ మధ్య పీట ముడి పడిపోయింది. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ ఉన్నంత వరకు ఎన్నికలు నిర్వహించకూడదన్న పట్టుదలతో ఉన్న ఏపీ సర్కార్.. అనేక రకాల కారణాలు చెబుతూ.. వాయిదాకు ప్రయత్నిస్తోంది.
మార్చితో పదవీ విరమణ చేయాల్సి ఉన్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తన పదవీ కాలంలో కనీసం ఒక్క సారి అయినా ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆయన తమ మాట వినడం లేదని.. ప్రతిపక్షానికి అనుకూలంగా ఉంటున్నారన్న అనుమానం ఏపీ సర్కార్ కి ఉంది. దాంతో పీట ముడిపడిపోయింది. ఎన్నికల విషయంలో ఎస్‌ఈసీ నిర్ణయమే అంతిమం అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం వీలైనంత వరకు సాగదీయాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తోంది.