ప్రజల్ని సమస్యల్లోకి నెట్టేసి ఇతర విషయాల గురించి ఆలోచించే సమయం లేకుండా చేసే వాళ్లే రాజకీయ నేతలు. అలాంటి సమస్యలు సృష్టించడానికి ఇప్పటి తరం.. కులం, మతం, ప్రాంత ద్వేషాలను అసువుగా ప్రజల మనసుల్లోకి ప్రవేశ పెట్టేస్తోంది. ఈ క్షుద్ర రాజకీయ ఫలితమే ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదం. అమరావతి రైతులు ఉద్యమం ప్రారంభించి ఏడాది అయిన సందర్భంగా ఓ సభ నిర్వహించారు. దానికి ఒక్క అధికార పార్టీ మినహా అన్ని పార్టీలు.. ప్రజాసంఘాలు హాజరయ్యాయి. అమరావతిని ప్రకటించినప్పుడూవీరందరూ మద్దతు పలికారు. అప్పట్లో మద్దతు పలికిన వారిలో ప్రస్తుత అధికారపక్షం వైసీపీ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆ ఒక్క పక్షమే మాట మార్చి అమరావతికి చెక్ పెట్టేసింది. భూములిచ్చిన రైతులపై నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తోంది.
అసలు రాజధాని సమస్య ఎందుకొచ్చింది..!?
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితిపై అందరూ ఆవేదన వ్యక్తం చేసేవారే. ఈ క్రమంలో.. తమ తమ వాదనల్ని కూడా వినిపిస్తూ బిజీగా ఉంటారు. కానీ అసలు సమస్య ఎలా ప్రారంభమయిందో మాత్రం గుర్తు చేసుకోవడానికి సిద్ధపడరు. ఎన్నికలకు ముందు వరకూ ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని సమస్యగా లేదు. రాష్ట్రం మధ్యలో ఉంటుందని.. గుంటూరు- విజయవాడ మధ్య నగరాన్ని కడితే.. రెండు నగరాలు కలిసి… పొరుగు రాష్ట్రాలకు ధీటుగా ఓ మహానగరం అభివృద్ధి చెందుతుందని… ఆంధ్ర భావి పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అందర్నీ కన్విన్స్ చేసి గత ప్రభుత్వం అమరావతిని ఎంపిక చేసింది. స్వయంగా ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే సమర్థించారు. అదేమీ రాజకీయ ప్రకటన కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాల ఆమోదంతోనే… అప్పటి ప్రభుత్వం అమరావతిని నిర్ణయించింది. ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. అందుకే.. అమరావతి కోసం రైతులు కూడా భూములివ్వడానికి ధైర్యంగా ముందుకొచ్చారు. ఎన్నికల్లో అమరావతి మార్పు అనే అంశం రాజకీయ తెరపైకి వచ్చినప్పుడు అందరూ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ వైపే అనుమానంగా చూశారు. ఆ పార్టీనే సందేహాస్పదంగా ప్రశ్నించారు. అయితే వారిచ్చిన సమాధానం ఒక్కటే రాజధాని అమరావతిలోనే ఉంటుంది… చంద్రబాబు అరకొరగా కడుతున్నారు.. తాము వచ్చి కట్టి చూపిస్తామన్నదే ఆ సమాధానం. దాంతో ఎవరికైనా రాజధాని కట్టడమే సమస్య అవుతుంది కానీ.. ఎంపిక కాదు. కానీ.. అలా చెప్పిన వాళ్లే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. రాజధానిని సమస్యగా చేశారు. ప్రజలు.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. లేని సమస్యను సృష్టించారు. ఆ సమస్య మీదుగా రాజకీయం చేస్తున్నారు.
ఇక ఏ ప్రభుత్వానికైనా విశ్వసనీయత అనేది ఉంటుందా..!?
ఏ కాస్త విశాలంగా ఆలోచించినా… అమరావతి రైతులు చేసింది .. ఇంకెవరూ చేయలేని త్యాగమని చెప్పవచ్చు. దానికి ఇప్పుడు.. చాలా చాలా అవసరాల కోసం సేకరిస్తున్న భూమి విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని సాక్ష్యంగా తీసుకోవచ్చు. ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి తమ ఆస్తులను ప్రజోపయోగ అవసరాల కోసం ఇస్తారు. పార్టీలను చూసి కాదు. అధికారంలోకి వచ్చే పార్టీలు శాశ్వతంగా ఉండవు. కానీ ప్రభుత్వం మాత్రం శాశ్వతం. ప్రభుత్వంపై నమ్మకాన్ని నిలబెట్టాల్సింది పార్టీలే. తమకు ఓ సారి అధికారం దక్కింది కాబట్టి.. మొత్తంగా ఇష్టం వచ్చేసినట్లుగా చేస్తామని చూస్తే.. మొత్తంగా ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారు. ఇలాంటి పరిస్థితి వస్తే ఆ ప్రభావం.. ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న అధికార పార్టీపై మాత్రమే ఉండదు.. పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై ఉంటుంది. తర్వాత వచ్చే ప్రభుత్వాలపై కూడా ఉంటుంది. ప్రభుత్వం మాటలను ప్రజలు విశ్వసించడం మానేస్తారు. ఇప్పటికే రాజకీయ వివిధ రకాల విన్యాసాల ద్వారా ప్రభుత్వం అంటే ప్రజలను పీడించుకునేది అనే అభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడు నిట్ట నిలువగా మోసం చేసేది కూడా అనే అభిప్రాయానికి వచ్చే పరిస్థితులు కల్పించేశారు. ప్రభుత్వాలకు విశ్వసనీయత అనేది లేకుండా చేసేశారు.
ఇప్పుడు సాధించిందేంటి..?
అభివృద్ధి వికేంద్రీకరణకు.. పాలనా వికేంద్రీకరణకు మధ్య తేడా ఏమిటో ప్రజలు తెలుసుకునే వెసులుబాటు ఇవ్వకుండా.. వందల కోట్లు పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేసి. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి.. ప్రాంతాలు, కులాల, మతాల వారీగా విడగొట్టేసి.. రాజధాని సమస్యను పెంచి పోషిస్తున్నారు. అసలు లేని సమస్యను సృష్టించారు. దానికే పొగపెట్టి.. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా చేసేస్తున్నారు. కానీ దాని వల్ల సాధించిందేమిటి..?. రాజధాని రైతులు నాశనం అయ్యారు తప్ప.. ఎవరైనా బాగుపడ్డారా..?. విశాఖపట్నం రాజధాని పేరుతో అక్కడ విపరీతంగా పెరిగిపోయిన కొనుగోళ్లను ఇన్ సైడర్ ట్రేడింగ్‌గా పేర్కొని.. తర్వాత వచ్చే ప్రభుత్వం కేసులు పెడితే… ఎవరు అన్యాయమైపోతారు..?. రాజధాని ప్రతిష్టంభన కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని ఎవరైనా అంచనా వేయగలరా..?. పెట్టుబడుల ప్రతిపాదనల్లేవు. ఎవరైనా ఇన్వెస్టర్ ఏపీ వైపు రావాలంటే.. ఈ గందరగోళ పరిస్థితుల్ని చూసి వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి. కానీ రాజధాని వస్తే చాలు ఏదో జరిగిపోతుందన్న భావన కల్పించి… ఆశలు రేపి.. ప్రచార రాజకీయంతో విధ్వంసం మాత్రం కొనసాగిస్తున్నారు. ప్రస్తుత వివాదం వల్ల… ఎవరూ లాభపడలేదు. రాజకీయంగా కొంత మంది బలపడి ఉంటారు. కానీ అంతిమంగా ప్రజలు మాత్రం ఓడిపోయారు.
రైతుల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులని తిట్టేస్తే సమస్య పరిష్కారం కాదు. పాలకుల్లా ఆలోచించాలి..!?
అంత మంది దగ్గర భూములు తీసుకోకపోతే.. రాజధాని సమస్యే ఉండేది కాదు. ఎందుకంటే.. ఆ భూముల కేంద్రంగానే ప్రస్తుత ప్రభుత్వం రాజధాని మార్పు నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల జపం చేస్తోంది. అక్కడ రాజధాని ఉంటే ఎవరో బాగుపడిపోతారన్న ఆక్రోశంతో వ్యవహరిస్తోంది. అలా బాగుపడేవారు రైతులు అంటే ఎక్కడ ప్రజలు సమర్థించరేమో అని వారిని రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా చేసేసి మంత్రులు తిట్టేస్తున్నారు. భూములిస్తామంటే వద్దంటున్నారని.. ప్లాట్లే కావాలంటున్నారని.. వారు రైతులెలా అవుతారని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. వీరికి సంబంధిచిన పొలాలు.. స్థలాలు.. ఆస్తుల్ని ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత .. ఇలాంటి పరిస్థితే ఎదురైతే.. ఎలా మాట్లాడుతారో.. వారిని ఏ వర్గం కింద కేటాయించుకుంటారో తెలియదు కానీ.. రాష్ట్రం కోసం ప్రభుత్వాన్ని నమ్మిన రైతుల్ని మాత్రం.. ఎవరూ చేయనంత మానసిహక హత్యాప్రయత్నాలను ప్రస్తుత ప్రభుత్వం చేస్తోంది.
రాజధాని సమస్యను పెద్దగా చేసి ఇతర సమస్యల్ని దాచడం ఎంతో కాలం సాగదు..!
రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తయింది. వారు లాఠీ దెబ్బలు తినడం దగ్గర్నుంచి న్యాయ పోరాటం వరకూ అన్నీ శక్తికి మించి చేస్తున్నారు. వారి ఉసురుపోసుకోక ముందే ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. వారికి న్యాయం చేయాల్సి ఉంది. వారితో చర్చించి.. ఏదో ఓ పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది. అలా కాకుండా ఈ సమస్యను ఇలాగే ఉంచి.. ప్రత్యేకహోదా నుంచి పరిశ్రమల ఆకర్ణ వరకూ.. తమ చేతకాని తనాన్ని బయటకు రాకుండా ఉంచుదామని పాలకులు అనుకుంటే అంత కంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. రైతులపై వారిపై కులం ముద్ర వేసో.. ప్రాంతం ముద్ర వేసో నిర్లక్ష్యం చేస్తే.. ఫలితం తప్పకుండా అనుభవించాల్సిందే. చరిత్ర చెప్పిన సత్యం ఇదే.