2020 ఓ… బ్లాక్ ఇయర్. చిత్రసీమకు కూడా. కరోటా టాలీవుడ్ ని గట్టి దెబ్బ కొట్టింది. మామూలుగా అయితే యేడాదికి 150 సినిమాలకు తక్కువ కాకుండా విడుదలయ్యేవి. కోవిడ్ ప్రభావంతో అది 50కి పడిపోయాయి. అందులో సగం ఓటీటీల పుణ్యం వల్ల బయటకు వచ్చినవే. సంక్రాంతి సీజన్లో కొన్ని హిట్ సినిమాలు రావడం, ఫిబ్రవరి, మార్చిలోనూ.. టాలీవుడ్ లో హిట్లు కనిపించడంతో సరిపోయింది. లేదంటే 2020ని తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అత్యంత చెత్త సంవత్సరంగా మిగిలిపోయేది.
సూపర్ సంక్రాంతి
ప్రతీ యేటా సంక్రాంతి నుంచే టాలీవుడ్ క్యాలెండర్ మొదలవుతుంది. సంక్రాంతి టాలీవుడ కి అతి ముఖ్యమైన సీజన్. వీలైనన్ని పెద్ద సినిమాలకు స్కోప్ ఉంటుంది. ఈసారీ.. బడా హీరోలు తలపడ్డారు. అల వైకుంటపురములో, సరిలేరు నీకెవ్వరు. ఎంతమంచివాడవురా.. ఈ సంక్రాంతికి తలపడ్డాయి. అయితే ప్రధాన పోరు మాత్రం.. మహేష్, బన్నీల మధ్యే. ఒక్కరోజు తేడాలో వచ్చిన ఈ రెండు సినిమాలూ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. రెండూ 200 కోట్ల మార్క్ దాటడంతో.. ఈ సంక్రాంతి సీజన్ సూపర్ హిట్టయిపోయింది. అయితే.. ఈ రెండు సినిమాల్లో కాస్త ఎక్కువ మార్కులు `అల వైకుంఠపురములో`కి పడ్డాయి. రివ్యూలూ, రేటింగులు కూడా ఈ సినిమాపైనే ఎక్కువ ప్రేమ కురిపించాయి. వీటి మధ్యన కల్యాణ్ రామ్ `ఎంత మంచివాడవురా` ఇరుక్కుపోయాడు. స్టార్ హీరోల సినిమాల ప్రభావానికి తట్టుకోలేక.. కల్యాణ్ రామ్ సైడ్ అయిపోయాడు.
ఈ రెండు సూపర్ హిట్ల తరవాత.. మరో హిట్టు చూడ్డానికి కాస్త గ్యాప్ వచ్చింది. రవితేజ `డిస్కోరాజా` ఫ్లాపుల జాబితాలో చేరిపోయింది. నాగశౌర్య `అశ్వద్ధామ`గా అలరించకపోయాడు. `96`కి రీమేక్ గా వచ్చిన `జాను` పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. `96`కి జిరాక్స్ కాపీగా మిగిలిందే తప్ప, ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయింది. ఫిబ్రవరిలోనూ ఫ్లాపుల గోల తప్పలేదు. విజయ్ దేవరకొండ `వరల్డ్ ఫేమస్ లవర్`గా మెప్పించలేకపోయాడు. మూడు లవ్ స్టోరీలు చూపించినా, అందులో ఏదీ.. ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. విజయ్ స్టామినా వల్ల కాస్తో కూస్తో ఓపెనింగ్స్ వచ్చాయి. లేదంటే… మరింత పెద్ద డిజాస్టర్ మూటగట్టుకోవాల్సివచ్చేది.
కాపాడిన ‘భీష్మ’
వరుస పరాజయాలకు నితిన్ కాస్త బ్రేక్ వేయగలిగాడు. నితిన్, రష్మిక జంటగా నటించిన `భీష్మ` ప్రేక్షకుల్ని అలరించింది. నితిన్ కెరీర్లో ఇది పెద్ద హిట్టు. యూత్ తో పాటుగా, కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్‌కి ఈ సినిమా రప్పించింది. ఫిబ్రవరిలోనే వచ్చిన `హిట్`…పేరుకి తగ్గట్టే హిట్ అనిపించుకుంది. నాని నిర్మాతగా మారి తీసిన సినిమా ఇది. విశ్వక్ సేన్ ఖాతాలో మరో విజయాన్ని చేర్చింది. మార్చి 6న విడుదలైన `పలాస` విమర్శకుల్ని మెప్పించింది. థియేటర్లలో పెద్దగా ఆడలేదు గానీ, ఓటీటీలో వచ్చాక… ఈసినిమాకి వ్యూవర్ షిప్ పెరిగింది. `నాదీ నకిలీసు గొలుసు..` పాట మాస్‌లోకి వెళ్లడంతో.. `పలాస` ఇంకాస్త దగ్గరైంది.
దయతలచిన ఓటీటీలు
కోవిడ్ కారణంగా మార్చి 17 నుంచి థియేటర్లు మూతబడ్డాయి. దాంతో సినిమాల విడుదలకు ఊహించని బ్రేక్ పడింది. ఫస్ట్ కాపీ చేతికొచ్చినా థియేటర్లు లేకపోవడంతో నిర్మాతలు డీలా పడిపోయారు. చివరికి ఓటీటీ సంస్థలు చొరవ చూపించి, ముందుకు రావడంతో కొద్దో గొప్పో సినిమాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 29న జీ 5లో `అమృతారామమ్` విడుదలైంది. నేరుగా ఓటీటీలోకి వచ్చిన తొలి తెలుగు సినిమా ఇది. ఆ తరవాత.. ఓటీటీ సినిమాలు వరుస కట్టాయి. కీర్తి సురేష్ నటించిన `పెంగ్విన్` అమేజాన్ ప్రైమ్‌లో వచ్చింది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈసినిమా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. కృష్ణ అండ్ హిజ్ లీల, 47 డేస్, భానుమతి రామకృష్ణ, ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య, జోహార్.. ఇలా చిన్న సినిమాలన్నీ ఓటీటీకి వరుస కట్టాయి.
ఓ పెద్ద సినిమా వస్తే… ఓటీటీ మార్కెట్ పుంజుకుంటుందనుకున్న నేపథ్యంలో `వి` హక్కుల్ని అమేజాన్ ప్రైమ్ దక్కించుకుంది. నాని, సుధీర్ బాబు కథానాయకులుగా నటించడం, ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకుడు అవ్వడం, దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి రావడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే… వాటిని అందుకోవడంలో `వి` విఫలం అయ్యింది. ఇదే దారిలో వచ్చిన `నిశ్శబ్దం` సైతం.. నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. కీర్తి సురేష్ `మిస్ ఇండియా` కూడా మిస్ ఫైర్ అయ్యింది. ఇలా వరుసగా మూడు పెద్ద డిజాస్టర్లు ఓటీటీకు తగలడంతో.. ఇక ఓటీటీలో సినిమా కొనడానికి ఎవ్వరూ ధైర్యం చేయరేమో అనిపించింది. ఓటీటీలో సినిమా వస్తే.. అది ఫ్లాపేనేమో… అన్న ముద్ర పడిపోయింది. అయినా సరే… ఓటీటీలు సినిమాలు కొనడం ఏమాత్రం తగ్గించలేదు. దాంతో అడపా దడపా చిన్న సినిమాలు ఓటీటీలోకి వస్తూనే ఉన్నాయి. `కలర్ ఫొటో`, `మిడిల్ క్లాస్ మెలోడీస్` లాంటి చిన్న సినిమాలు ఓటీటీలో మెరిశాయి. ఇంకా కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ప్రతి శుక్రవారం ఓ కొత్త సినిమా థియేటర్లోకి రావడం ఆనవాయితీ. వాటిని ఓటీటీలూ పాటించాయి. ప్రతీ వారం ఓటీటీలో ఏదో ఓ సినిమా వస్తూనే ఉంది. ఆహా కొన్ని డబ్బింగ్ సినిమాల్ని టోకుగా కొనేసి, ఒకటొకటీ వదులుతోంది. హిందీ, మలయాళ సినిమాలు సైతం తెలుగుప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. థియేటర్లు లేని లోటుని తీర్చడంలో ఓటీటీలు కొంత వరకూ… సఫలీకృతం అయ్యాయి.
అయినా ఊపు రాలేదు
అన్ లాక్ ప్రక్రియలో భాగంగా.. థియేటర్లు తెరచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. అయినా సరే.. నిర్మాతలకు ఊపు రాలేదు. కొత్త సినిమాల తాకిడి కనిపించలేదు. దానికి రకరకాల కారణాలున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో సర్దుకుపోవడం నిర్మాతలకు ఇష్టం లేదు. తమ ఆదాయాన్ని సగానికి సగం తగ్గించుకోవడం ఇష్టం లేకపోవడంతో కొత్త సినిమాలు రాలేదు. పైగా నిర్మాతలకూ, ఎగ్జిబీటర్లకూ మధ్యన చర్చలు సఫలం కాలేదు. క్రిస్మస్ నుంచి కొత్త సినిమాలు రావాల్సివుంది. అప్పటికి… ఈ చర్చలు ఫలప్రదం అవుతాయో లేదో మరి.
ఆశలన్నీ 2021పైనే..
క్రిస్మస్కి సినిమాలు వచ్చినా, రాకపోయినా.. 2021 సంక్రాంతి నాటికి పరిస్థితులు చక్కబడతాయన్నది అందరి నమ్మకం. సంక్రాంతికి ఎలాగూ పెద్ద సినిమాలు రెడీ అవుతాయి. ప్రేక్షకులకు సినిమాలపై ఆసక్తి వుందా? ధైర్యం చేసి థియేటర్లకు వస్తారా? అనే విషయాలు సంక్రాంతికి తేలిపోతాయి. అప్పటిలోగా 50 శాతం ఆక్యుపెన్సీ అనే నిబంధన కూడా పక్కకు వెళ్లిపోతుందని భావిస్తున్నారు. అదే జరిగి.. 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇస్తే… నిర్మాతలు, ఎగ్జిబీటర్ల మధ్య రాజీ కుదిరితే.. 2021 నుంచి అసలైన సినిమా వినోదం చూడొచ్చు. 2020లో కోల్పోయిన దాన్ని… వడ్డీతో సహా రాబట్టాలని చిత్రసీమ భావిస్తోంది. మరి 2021లో సినిమా జాతకం ఎలా వుందో??