ఏపీ ప్రభుత్వ అధికారులు రూపొందించిన చట్టాలు చాలా వరకూ వెనక్కి వచ్చాయి. అనేక వాటిపై కేసులు పడ్డాయి. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయన్న విమర్శలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు… ప్రాజెక్టులకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు కూడా అలాగే వెనక్కి వస్తున్నాయి. కనీస అవగాహన లేకుండా ఆ ఆ డీపీఆర్‌లు తయారు చేయడం ఏమిటన్న కామెంట్లు కూడా వాటితో పాటు వస్తున్నాయి. రాయలసీమ నీటి అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం.. సంగమేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టాలనుకుంది. దానికి టెండర్లు కూడా పిలిచింది. కానీ… ఎన్జీటీలో స్టే వచ్చింది. అదే సమయంలో… కేంద్ర ప్రభుత్వం కూడా డీపీఆర్ సమర్పించి.. అపెక్స్ కౌన్సిల్లో పర్మిషన్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును రాష్ట్రం నుంచి పంపారు అధికారులు.
ఇలా డీపీఆర్ పంపగానే.. అలా రివర్స్‌లో తిరిగొచ్చింది. డీపీఆర్‌లో ప్రాథమిక సమాచారం కూడా లేదని రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజనీరింగ్ విభాగంపై కేంద్ర జల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ను ఎలా సమర్పించాలో కేంద్ర జల సంఘం వెబ్ సైట్లో చూసి అవగాహన పెంచుకోవాలని సూచించింది. డీపీఆర్‌లో సాంకేతిక – ఆర్థిక అంశాల సమాచారమే లేదని … హైడ్రాలజీ, అంతరాష్ట్ర అంశాలు, సాగు ప్రణాళికా డిజైన్, డిజైన్ అంచనా వ్యయానికి సంబంధించిన అంశాలూ.. డ్రాయింగ్స్ ఏమీ లేకుండా డీటైల్డ్ అని ఎలా అంటారని ప్రశ్నించింది. మొత్తం వివరాలతో మళ్లీ డీపీఆర్ పంపాలని ఆదేశించింది.
సాగునీటి ప్రాజెక్ట్ లు, బహుళార్థసాధక ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను ఎలా రూపొందించాలో 2010లో నిబంధనలు విడుదల చేశారు. ఫార్మాట్ కూడా.. కేంద్ర జల సంఘం వెబ్ సైట్ లో ఉంది. అదేవిధంగా 2017 మార్గదర్శకాలు కూడా సీడబ్ల్యుసీ వైబ్ సైట్లో ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం ఆషామాషీగా ఓ లేఖ రాసినట్లుగా రాసేసి .. దానికి డీపీఆర్ పేరు పెట్టారు. దీంతో ఏపీ అధికారుల తీరు ఢిల్లీలో మరోసారి నవ్వుల పాలయింది.