ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ రివర్స్ పనులే చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉండగా.. వేటికి వ్యతిరేకంగా ఆందోళనలు.. ఆరోపణలు చేశారో వాటినే ఇప్పుడు అప్పటి ప్రభుత్వం కన్నా దూకుడుగా అమలు చేస్తున్నారు. పీపీఏల దగ్గర్నుంచి జీఎంఆర్ ఎయిర్ పోర్టు వరకు.. దివీస్ పరిశ్రమ నుంచి తాజాగా… బాక్సైట్ తవ్వకాల వరకూ అదే సిరీస్ నడుస్తోంది. బాక్సైట్ తవ్వేదే లేదంటూ… గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను.. ఈ ప్రభుత్వంలో మరోసారి జారీ చేశారు.కానీ అలా జారీ చేసి ఆరు నెలలు గడవక ముందే.. మరో జీవో జారీ అయింది. గత వారం 89వ నెంబర్ జీవోను ప్రభుత్వం రిలీజ్ చేసింది. అందులో ఉన్న మొదటి అంశం.. రస్ అల్ ఖైమాకు బాక్సైట్ సరఫరా చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో పరిశీలించడమే.
వైఎస్ హయాంలో రస్ అల్ ఖైమాకు బాక్సైట్ గనుల్ని కట్ట బెట్టేశారు. క్విడ్ ప్రో కోలు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అలాగే.. బాక్సైట్ తవ్వకాలపై గిరిజనుల పోరాటం మరో అంశం. వైఎస్ మరణం తర్వాత అవన్నీ ఆగిపోయాయి. దాంతో… జగన్ అక్రమాస్తుల కేసులో.. రస్ అల్ ఖైమాతో కలిసి పెట్టుబడులు పెట్టిన వారు బుక్కయ్యారు. రస్ అల్ ఖైమా వాన్ పిక్ ప్రాజెక్టులో కూడా భాగమయింది. ఇటీవల ఆ ప్రాజెక్ట్ లో మోసం చేశారంటూ నిమ్మగడ్డ ప్రసాద్‌ను చాలా కాలం సెర్బియా జైల్లో ఉంచారు. ఆ తర్వాత ఏమయిందో తెలియదు కానీ ఆయన రిలీజై వచ్చారు. అలా వచ్చిన తర్వాత రస్ అల్ కైమా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఏపీ సర్కార్ రస్ అల్ ఖైమాకు సెటిల్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా కమిటీని నియమిస్తూ జీవో జారీ చేసింది.
వివాదం పరిష్కారానికి ఏమి చేస్తే బాగుంటుందో సూచించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న ఒక కమిటీని ఏర్పాటుచేసింది. బాక్సైట్ సరఫరాకు ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి? అల్యూమీనియం ఫ్యాక్టరీ నడవడానికి ఏమి చేస్తే బాగుంటుంది? అంతర్జాతీయ వివాదం లేవనెత్తినందున కోర్టు బయట పరిష్కరించుకోవడానికి గల అవకాశాలు ఏమిటి?…అనే అంశాలపై తగిన సూచనలు చేయాలని ప్రభుత్వం ఈ కమిటీని కోరింది. ఈ కమిటీ ఇప్పటికే ఓ సారి సమావేశమైంది. రస్ అల్ ఖైమా ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఈ వివాదం అనేక అంశాలతో ముడిపడి ఉండటంతో ఏదో ఓ రూపంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందన్న ప్రచారం మాత్రం ప్రారంభమయింది.