ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందన్న అంశంపై హైకోర్టులో జరుగుతున్న విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజ్యాంగ విచ్చిన్నం అంశంపై విచారణ జరిపేందుకు హైకోర్టుకు అధికారం లేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోలేదు కదా.. అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయమూర్తి ఆ ఆదేశాలను ఎందుకు జారీ చేశారో అర్థం కావడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ పిటిషన్ను వ్యతిరేకించిన న్యాయవాది సిద్దార్థ లూథ్రాపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. మీరు ఎన్నాళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారని ప్రశ్నించి… ఇలాంటి ఆదేశాలు ఎప్పుడైనా ఇచ్చారా అని ప్రశ్నించింది. కనీసం హెబియస్ కార్పస్ పిటిషన్లపై.. విచారణకు అనుమతించాలని సిద్దార్థ లూథ్రా కోరారు. దీంతో ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సెలవుల తర్వాత తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. ఏపీలో పలువురు వ్యక్తుల్ని పోలీసులు అపహరించుకుపోతున్నారన్న అంశంపై పలు హేబియస్ కార్పస్ పిటిషన్లు దాఖల్యయాయి.
వీటిపై విచారణ జరిపిన జస్టిస్ రాకేష్ కుమార్ ధర్మానసం.. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామని అక్టోబర్ 1న ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు వెనక్కి తీసుకోవాలన్న ఏపీ అభ్యర్థనను తోసిపుచ్చింది. రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై హైకోర్టు ఆదేశాలిస్తే.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఏపీ సర్కార్ హుటాహుటిన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనుకూల ఫలితం పొందింది.